భారత క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. ఆ ఇద్దరితో టీమిండియా పరువుపాయే..!

Team India Embarrassing Record: భారత టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు ఇద్దరూ ఎదుర్కొన్న మొదటి బంతికే సున్నా పరుగులకే అవుట్ కావడం ఇదే తొలిసారి.

Update: 2026-06-29 07:32 GMT

భారత క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. ఆ ఇద్దరితో టీమిండియా పరువుపాయే..!

Team India Embarrassing Record: క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా వెలుగొందుతున్న భారత జట్టుకు ఐర్లాండ్ గడ్డపై కోలుకోలేని షాక్ తగిలింది. పసికూన అనుకున్న జట్టు ముందు మన టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఓపెనర్లు ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి, భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక అత్యంత ఘోరమైన, అవమానకరమైన రికార్డును మూటగట్టుకున్నారు.

సున్నాకే చేతులెత్తేసిన ఓపెనర్లు.. చరిత్రలో తొలిసారి..!

బెల్ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శాంసన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా కొట్టిన షాట్ గాల్లోకి లేచి క్యాచ్‌గా మారడంతో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు ఇద్దరూ ఎదుర్కొన్న మొదటి బంతికే సున్నా పరుగులకే అవుట్ కావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది కేవలం నాలుగోసారి మాత్రమే కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత సంతతి బౌలర్ దెబ్బ.. విలవిల్లాడిన బ్యాటింగ్ లైనప్..

భారత్‌కు సులువుగా అనిపించిన ఈ లక్ష్యం కాస్తా, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఒక పీడకలగా మారింది. రాజస్థాన్‌కు చెందిన భారత సంతతి ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రా తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను కప్పేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో వేసిన మొదటి బంతికే సంజూ శాంసన్‌ను అవుట్ చేసిన ముంద్రా, ఈ మ్యాచ్‌లో కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పిచ్‌పై బంతి అవుతున్న తీరును అంచనా వేయడంలో మన టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పవర్‌ప్లే ముగిసేసరికే భారత్ 4 వికెట్లు కోల్పోయి కేవలం 54 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్‌పై పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు సమర్పించుకోవడం కూడా ఇదే మొదటిసారి.

కెప్టెన్, కోచ్‌లపై పెరగనున్న ఒత్తిడి..

ఈ ఘోర వైఫల్యానికి ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా తోడైంది. జట్టును ఆదుకోవాల్సిన ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 148 పరుగులకే పరిమితమైన భారత్, రెండో మ్యాచ్‌లోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఇప్పటివరకు ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఎప్పుడూ సిరీస్ ఓడిపోలేదు. ఈ ఓటమితో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంతో పాటు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయిన మొదటి భారతీయ కోచ్‌గా గంభీర్ నిలవాల్సి రావడం గమనార్హం.

ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత జట్టు, పసికూన ఐర్లాండ్ చేతిలో ఈ విధంగా మోకరిల్లడం అభిమానులకు అస్సలు మింగుడుపడటం లేదు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్న తరుణంలో బాధ్యతారాహిత్యంగా విఫలం కావడం జట్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. రాబోయే సిరీస్‌లలోనైనా ఈ తప్పులను సరిదిద్దుకుని భారత్ మళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News