వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ నో ఛాన్స్.. తేల్చిపారేసిన బీసీసీఐ..!

vaibhav sooryavanshi t20i debut: బెల్ఫాస్ట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన భారత్, రెండో మ్యాచ్‌లోనూ అదే తప్పును పునరావృతం చేసింది.

Update: 2026-06-29 06:03 GMT

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ నో ఛాన్స్.. తేల్చిపారేసిన బీసీసీఐ..!

Vaibhav Sooryavanshi T20i Debut: టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆనందం ఆవిరి కాకముందే.. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న పరాభవం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఘోర ఓటమితో గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎందుకు మైదానంలోకి దించలేదన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఐర్లాండ్ చేతిలో పరాభవం.. కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్..

బెల్ఫాస్ట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన భారత్, రెండో మ్యాచ్‌లోనూ అదే తప్పును పునరావృతం చేసింది. బౌలర్లు అద్భుతంగా రాణించి ఐర్లాండ్‌ను 154 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, మన బ్యాటర్లు ఘోరంగా విఫలమై 0-2తో సిరీస్‌ను కోల్పోయారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోవడంతో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఒక్క అవకాశమైనా ఇచ్చి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్ సంచలనం.. సూర్యవంశీ మెరుపులు..

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అసాధారణ ప్రదర్శనతోనే అతను చాలా వేగంగా భారత్-ఎ జట్టుతో పాటు సీనియర్ జట్టులోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం యూకే పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు కూడా ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

సంజూ శాంసన్‌కు అండగా మేనేజ్‌మెంట్.. వైభవ్‌కు నిరీక్షణే..!

ఈ విషయంపై భారత జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ స్పష్టతనిచ్చారు. ఐర్లాండ్‌తో ఓటమి అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా సిద్ధమయ్యాడని, అయితే అతని కోసం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టలేమని తేల్చి చెప్పారు. మూడు నెలల క్రితం జరిగిన ప్రపంచకప్ విజయంలో సంజూ కీలక పాత్ర పోషించాడని, ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు భారీ సెంచరీలతో దాదాపు 500 పరుగులు చేశాడని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఆటగాళ్లకు నమ్మకాన్ని ఇవ్వడం ముఖ్యమని, వైభవ్ తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు టాప్-3 పై ఒత్తిడి..

ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అభిషేక్ మొదటి మ్యాచ్‌లో 49 పరుగులు చేసినా, రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 13 పరుగులే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఈ టాప్-3 బ్యాటర్లపై భారీ ఒత్తిడి ఉండనుంది. ఈ పర్యటనలో భాగంగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ కూడా ఆడనుంది.

భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మేనేజ్‌మెంట్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై భారత టాప్ ఆర్డర్ పుంజుకుంటుందో లేదో, లేక వైభవ్‌కు అవకాశం దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News