Rohit Sharma History: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. లెజండరీ ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!

Rohit Sharma History: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు (51) బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

Update: 2026-04-04 13:49 GMT

Rohit Sharma

Rohit Sharma History: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు (51) బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో ఓ సిక్స్ బాదడంతో ఈ ఘనత ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో లెజండరీ, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ రికార్డను బ్రేక్ చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఆ సిక్సే అతడిని ఐపీఎల్ చరిత్రలో నిలిపింది. ఈ సిక్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అతడి సిక్సుల సంఖ్య 51కి చేరింది. దీంతో ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 50 సిక్సర్లు బాదగా.. రోహిత్ ఇప్పుడు ఆ రికార్డును దాటేశాడు. రోహిత్ డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ఈ రికార్డు సిక్సులను సాధించాడు.

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అ‍త్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61 సిక్సర్లు బాది టాప్‌లో నిలిచాడు. కోల్‌కతాపై కూడా గేల్ 54 సిక్సులు ఉన్నాయి. మొదటి రెండు స్థానాల్లో విండీస్ దిగ్గజం ఉన్నాడు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ 48 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే.. ఐపీఎల్‌లో రోహిత్ మరో అరుదైన మైలురాయి అందుకుని తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై జట్టుకు రోహిత్ ఐదు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News