IPL 2026: చెపాక్‌లో పంజాబ్ కింగ్స్ పంజా.. చెన్నైపై చారిత్రాత్మక విజయం
IPL 2026: ఐపీఎల్ 2026 ఏడో మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 210 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి పంజాబ్ చరిత్ర సృష్టించింది.
CSK vs PBKS
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఏడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలనం సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటగా భావించే ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో సీఎస్‌కేకే చుక్కలు చూపించింది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత పోరాటంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (73) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే (45 నాటౌట్) తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడగా, చివర్లో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లోనే 32 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాక్ రెండు వికెట్లు తీయగా.. బార్ట్లెట్, యాన్సన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేసి సీఎస్‌కే బౌలర్లను వణికించాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ కేవలం 6 ఓవర్లలోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు.
మిడిల్ ఓవర్లలో కూపర్ కాన్లీ (36) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా జట్టును ముందుకు నడిపాడు. 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అర్ధశతకాన్ని అందుకున్నాడు. శ్రేయస్ దూకుడుగా ఆడుతూనే వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో పంజాబ్ కింగ్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 210 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. సీఎస్‌కే బౌలర్లు చెపాక్ పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. చెన్నై హోమ్ గ్రౌండ్‌లో 200 పైచిలుకు లక్ష్యాన్ని రెండుసార్లు ఛేదించిన మొదటి జట్టుగా పంజాబ్ అవతరించింది. ఇప్పటివరకు మరే ఇతర జట్టు కూడా చెపాక్‌లో సీఎస్‌కేపై రెండుసార్లు 200 ప్లస్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేజ్ చేయలేదు. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం, దూకుడు చూస్తుంటే ఈ సీజన్‌లో ఆ జట్టు హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.