CSK vs PBKS: చేపాక్‌లో చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ దోస్త్.. 29 బంతుల్లోనే తుఫాన్ హాప్ సెంచరీ..!

Ayush Mhatre half century: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌లో మొదటి బంతికే అవుటైన చేదు జ్ఞాపకాన్ని తుడిచేస్తూ, కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నై భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Update: 2026-04-03 15:43 GMT

Ayush mhatre

Ayush Mhatre half century: చెన్నైలోని ప్రఖ్యాత చేపాక్ మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్‌లో చెన్నై 5 పరుగులు మాత్రమే రాబట్టింది. అయితే రెండో ఓవర్‌లోనే చెన్నైకి ఊహించని దెబ్బ తగిలింది. బార్ట్‌లెట్ వేసిన ఐదో బంతిని బౌండరీకి తరలించిన శాంసన్, ఆ తర్వాతి బంతికే వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన శాంసన్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై అభిమానులను నిరాశపరిచాడు.

మాత్రే విధ్వంసం: బౌండరీల వర్షం..

సంజు శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. ఐదో ఓవర్‌లో ఒక భారీ సిక్సర్, ఆరో ఓవర్‌లో మరో ఫోర్ బాదడంతో చెన్నై పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా మాత్రే ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

సిక్సర్లతో విరుచుకుపడి.. 29 బంతుల్లోనే ఫిఫ్టీ..

యూనిస్ జాన్సన్ వేసిన ఆరో ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన మహాత్రే, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చహల్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో పంజాబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. అయితే తొమ్మిదో ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌కు రాగానే మహాత్రే మళ్లీ తన ప్రతాపాన్ని చూపాడు. ఆ ఓవర్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి కేవలం 29 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆ తర్వాతి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపి తన ఫామ్‌ను చాటుకున్నాడు.

భారీ స్కోరు దిశగా చెన్నై సూపర్ కింగ్స్..

తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వా, ఆయుష్ మహాత్రే నిలకడగా ఆడుతూ పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా మాత్రే ఆడుతున్న షాట్లు, అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపిస్తోంది. గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించి మహాత్రే చూపిన ఈ పోరాట పటిమను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News