MI vs DC: మరోసారి రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ముంబైపై ఢిల్లీ సునాయాస విజయం!

DC vs MI IPL 2026: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మొదటి మ్యాచులో గెలిచిన ఢిల్లీ.. ముంబై ఇండియన్స్‌పై సునాయాస విజయం అందుకుంది.

Update: 2026-04-04 14:06 GMT

DC vs MI IPL 2026: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మొదటి మ్యాచులో గెలిచిన ఢిల్లీ.. ముంబై ఇండియన్స్‌పై సునాయాస విజయం అందుకుంది. ముంబై నిర్ధేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ పటేల్ సారథ్యంలోని జట్టు మరో 11 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయంలో సమీర్‌ రిజ్వీ కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు బాదాడు. పాథుమ్‌ నిస్సాంక (44), డేవిడ్ మిల్లర్ (21) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, కార్బిన్‌ బోష్‌ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంకు చేరుకుంది.

లక్ష ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఒకే రన్ చేసి పెవిలియన్‌కు చేరాడు. నితీష్‌ రాణా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ పాథుమ్‌ నిస్సాంక, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ముందుగా ఆచితూచి ఆడడంతో ఆరు ఓవర్లకు 42 రన్స్ చేసింది. నిస్సాంక గేర్ మార్చడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దూకుడుగా ఆడే క్రమంలో శాంట్నర్‌ బౌలింగ్‌లో (9.5) నిస్సాంక వెనుదిరిగాడు. రిజ్వీ బాధ్యత తీసికుని బౌండరీల వర్షం కురిపించాడు. 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదాడు. అతడికి డేవిడ్‌ మిల్లర్‌ సహకరించాడు. రిజ్వీ అద్భుత ఆటతో ఢిల్లీని విజయానికి దగ్గర చేసి అవుట్ అయ్యాడు. మిగతా పనిని మిల్లర్ పూర్తి చేశాడు.

అంతకుముందుబ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ (51) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్‌ శర్మ (35), నమన్‌ ధీర్‌ (28) రాణించాడు. స్టార్ బ్యాటర్లు తిలక్‌ వర్మ (0), ర్యాన్‌ రికెల్టన్‌ (9), రూథర్‌ఫర్డ్‌ (5) విఫలమయ్యారు. ఆరంభంలో కీలక వికెట్స్ కోల్పోవడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అక్ష‌ర్ పటేల్, న‌ట‌రాజ‌న్‌, లుంగి ఎంగిడి, విప్ర‌జ్ నిగ‌మ్‌ త‌లా వికెట్ తీశారు. అనారోగ్యం కారణంగా ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ ఆడలేదు.

Tags:    

Similar News