IPL 2026 : ముకుల్ సిక్సర్ల జాతర.. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. కోల్‌కతా పై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
IPL 2026 : కేకేఆర్‌పై లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. 21 ఏళ్ల ముకుల్ చౌదరి 7 సిక్సర్లతో వీరవిహారం చేసి అసాధ్యమైన ఛేజింగ్‌ను సుసాధ్యం చేశాడు.
Mukul Chaudhary
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ పోరులో ఒక అద్భుతమే జరిగింది. ఓటమి ఖాయమనుకున్న స్థితిలో ఒక కుర్రాడు ఉగ్రరూపం దాల్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 30 లక్షల బేస్ ప్రైస్ నుంచి కోట్లు కురిపించుకున్న ముకుల్ చౌదరి, తాను ఎందుకు స్పెషలో ఈ మ్యాచ్‌తో నిరూపించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (9) త్వరగా అవుట్ అయినా, సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (41) తన అనుభవాన్ని రంగరించి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యువ ప్లేయర్ అంకుష్ రఘువంశీ (45) అతనికి చక్కని సహకారం అందించాడు. చివర్లో కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్) ధాటిగా ఆడటంతో కేకేఆర్ భారీ స్కోరును సాధించింది. లక్నో బౌలర్లలో షమీ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఆరంభంలోనే తడబడింది. స్టార్ బ్యాటర్లు ఎయిడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ త్వరగా పెవిలియన్ చేరారు. కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ కూడా నిరాశపరచడంతో 15.6 ఓవర్ల కల్లా లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టేడియంలోని అభిమానులంతా కేకేఆర్ విజయం ఖాయమని సంబరాలు మొదలుపెట్టారు. కానీ అప్పుడే అసలైన సినిమా మొదలైంది.
లక్నో కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన 21 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు ముకుల్ చౌదరి విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం 2 ఫోర్లు ఉంటే, ఏకంగా 7 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. కేకేఆర్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా బంతిని బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా ఆయుష్ బదోని (54) అద్భుతమైన హాఫ్ సెంచరీతో అండగా నిలవడంతో లక్నో అసాధ్యమైన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ముకుల్ చౌదరి రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు. ఈ వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన ఇతని టాలెంట్‌ను గుర్తించిన లక్నో యాజమాన్యం రూ. 2.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే కాదు, ముకుల్ వేగంగా బౌలింగ్ కూడా చేయగలడు. ఈడెన్ గార్డెన్స్‌లో అతను బాదిన 7 సిక్సర్లు ఐపీఎల్ చరిత్రలో గొప్ప ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతాయి. ఈ గెలుపుతో లక్నో ఊపు పెంచుకోగా, కేకేఆర్ మళ్ళీ ఆత్మరక్షణలో పడింది.