IPL 2026 : అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల సునామీ.. ఆఖరి బంతికి గుజరాత్ మ్యాజికల్ విక్టరీ
IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం. ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో గెలుపు. కేఎల్ రాహుల్ పోరాటం వృథా కాగా, మిల్లర్ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.
GT vs DC
IPL 2026 : ఐపీఎల్ 2026లో మరో హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో గెలుపు ఊగిసలాడి.. చివరికి గుజరాత్‌ను వరించింది. కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే విరుచుకుపడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 70 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడగా.. జోస్ బట్లర్ (52) మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక నాలుగో నంబర్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు బాదడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీశాడు.
కేఎల్ రాహుల్ వీరోచిత పోరాటం
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ కేఎల్ రాహుల్ వెన్నుముకలా నిలిచాడు. కేవలం 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జట్టును గెలుపు అంచున నిలిపాడు. పాథుమ్ నిస్సాంక (41) అతనికి చక్కటి సహకారం అందించాడు. అయితే ఈ క్రమంలోనే డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా కాసేపు తప్పుకుని, మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 20 బంతుల్లో 41 పరుగులు చేసి మ్యాచ్‌ను రక్తికట్టించాడు.
మిల్లర్ చేసిన ఆ చిన్న పొరపాటు
చివరి 2 బంతుల్లో ఢిల్లీకి 2 పరుగులు కావాల్సిన తరుణంలో హై-డ్రామా మొదలైంది. 20వ ఓవర్ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. స్ట్రైక్ తన వద్దే ఉంచుకోవాలనే ఉద్దేశంతో పరుగు తీయడానికి నిరాకరించాడు. చివరి బంతికి 2 పరుగులు తీసి గెలిపించాలనుకున్న మిల్లర్, ఆ బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో ఆ బంతి డాట్ అవ్వడంతో ఢిల్లీ 8 వికెట్లకు 209 పరుగుల వద్దే ఆగిపోయింది. గుజరాత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సంబరాల్లో మునిగిపోయింది.
విజయాల ఖాతా తెరిచిన గుజరాత్
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో తమ మొదటి గెలుపును నమోదు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది మొదటి ఓటమి. కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అవ్వడం, జట్టు ఓడిపోవడం ఢిల్లీ అభిమానులను నిరాశకు గురిచేసింది. మిల్లర్ గాయంతో ఆడినా, చివరి నిమిషంలో అతను తీసుకున్న నిర్ణయం ఢిల్లీకి శాపంగా మారింది.