David Warner Arrest: టెస్ట్‌ చేయగా దొరికేశాడు.. డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌!

David Warner Arrest: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ అరెస్టయ్యాడు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2026-04-07 14:19 GMT

David Warner Arrest: టెస్ట్‌ చేయగా దొరికేశాడు.. డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌!

David Warner Arrest: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ అరెస్టయ్యాడు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా తమ కథనంలో పేర్కొన్నాయి. వార్నర్‌ను బెయిల్‌పై పోలీసులు విడిచిపెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వార్నర్‌ వచ్చే నెల కోర్టులో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రకటన ప్రకారం.. ఈ ఘటన ఏప్రిల్ 5 సాయంత్రం 5:30 సమయంలో మారౌబ్రాలోని మలబార్ రోడ్డులో జరిగింది.

ఏప్రిల్ 5న న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ర్యాండమ్ బ్రీత్ టెస్ట్ నిర్వహించారు. బ్రీత్‌ టెస్టింగ్‌ను చూడగానే.. డేవిడ్ వార్నర్‌ తన కారును ఆపి పక్కన పార్క్‌ చేశాడు. ఇది గమనించిన పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌తో టెస్ట్‌ చేశారు. మొదటి టెస్టులోనే మద్యం సేవించినట్లు తేలడంతో అతడిని స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన రెండో టెస్టులో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో అనుమతించిన పరిమితికి రెండింతలు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వచ్చే నెలలో కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు.

డేవిడ్ వార్నర్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌ లీగ్‌ 2026లో ఆడుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న దేవ్ భాయ్.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. పీఎస్ఎల్ కోసం మరలా పాకిస్థాన్‌కు వెళ్లనున్నాడు. కరాచీ జట్టు ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉంది. వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్నర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరాచీ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో కరాచీలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో వార్నర్ పాల్గొంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌పై ఈ సంఘటన ప్రభావం ఎంతవరకు పడుతుందో చూడాలి.

Tags:    

Similar News