David Miller: నరాలు తెగే ఉత్కంఠ, ఆ ఒక్క రన్ తీసుంటేనా.. డేవిడ్ మిల్లరే ఢిల్లీ ఓటమికి కారణం!
DC Fans Roast David Miller: చివర్లో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లోనే 41 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి మెరుపులు మెరిపించినా.. జట్టును విజ తీరాలకు చేర్చలేకపోయాడు. మిల్లరే ఢిల్లీ ఓటమికి కారణం అయ్యాడు.
David Miller
David Miller: ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హై వోల్టేజ్ పోరులో గుజరాత్ ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. చివరకు డేవిడ్ మిల్లర్ కారణంగా ఢిల్లీ ఓటమిని చవిచూడక తప్పలేదు. ఈ విజయంతో టైటాన్స్ ఈ సీజన్‌లో పాయింట్ల ఖాతాను తెరిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. పాథుమ్ నిశాంక (41) రాణించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లోనే 41 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి మెరుపులు మెరిపించినా.. జట్టును విజ తీరాలకు చేర్చలేకపోయాడు. మిల్లరే ఢిల్లీ ఓటమికి కారణం అయ్యాడు.
ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన వేళ డ్రామా తారాస్థాయికి చేరింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మొదటి బంతికి విప్రాజ్ నిగమ్ ఫోర్ బాదాడు. దాంతో 5 బంతుల్లో 9 రన్స్ అవసరం అయ్యాయి. 2వ బంతికి విప్రాజ్ నిగమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3వ బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీశాడు. 4వ బంతికి డేవిడ్ మిల్లర్ కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. దాంతో ఢిల్లీ విజయ సమీకరణం 2 బంతుల్లో 2గా మారింది. 5వ బంతికి మిల్లర్ సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. తీయలేదు. స్ట్రైకింగ్ తన వద్దే ఉంచుకోవాలని పరుగు తీయడానికి నిరాకరించాడు. 6వ బంతికి మిల్లర్ షాట్ ఆడగా.. బంతి కనెక్ట్ కాలేదు. బై రూపంలో సింగిల్ తీద్దామని ప్రయత్నించగా.. కుల్దీప్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
5వ బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసుంటే మ్యాచ్ టై అయ్యేది. అప్పుడు చివరి బంతికి పరిస్థితి మరోలా ఉండేది కావొచ్చు. స్ట్రైకింగ్ చేసే కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసేవాడేమో. అదే జరిగితే ఢిల్లీ గెలిచేది. మిల్లర్ సింగిల్ తీయకపోవడంతో.. అతడే ఢిల్లీ ఓటమికి కారణం అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ ఫాన్స్ మిల్లర్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ఒక్క రన్ తీసుంటే ఏమైంది మిల్లర్, డేవిడ్ మిల్లరే ఢిల్లీ ఓటమికి కారణం అంటూ ఫైర్ అవుతున్నారు.