Mohammed Shami: నా అసలు సీక్రెట్ అదే.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mohammed Shami opens up on his fitness and hard work. ఎస్‌ఆర్‌హెచ్‌పై షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
Mohammed Shami
Mohammed Shami: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) అద్భుత విజయాన్ని అందుకుంది. ఎల్ఎస్‌జీ విజయంలో కెప్టెన్ రిషభ్ పంత్ (68; 50 బంతుల్లో 9×4), పేసర్ మహ్మద్ షమీ (2/9) కీలక పాత్ర పోషించారు. షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన సీక్రెట్ ఏంటో వెల్లడించాడు. ప్రతి మ్యాచ్‌లో అదనపు శ్రమ పెట్టడం, ఫిట్‌నెస్ ఎంతో కీలకం అని చెప్పాడు.
గత మ్యాచ్‌లో ఓటమి ఎదురైన నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలవడం ఎల్ఎస్‌జీకి చాలా కీలకమని పేర్కొన్న మహ్మద్ షమీ.. ఈ విజయం జట్టుకు మోమెంటమ్ ఇస్తుందని చెప్పాడు. 'ఈ విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత మ్యాచ్‌లో మా హోం గ్రౌండ్‌లో ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్ గెలవడం మాకు చాలా ముఖ్యం. ఒకసారి మంచి ఆరంభం దొరికితే.. ఆ విజయాల ఊపు అలాగే కొనసాగుతుంది. మంచి ప్రదర్శన ఇవ్వాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఎప్పుడూ మైదానంలో అదనపు శ్రమ పెట్టాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం అవసరం. జట్టు గెలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విజయాలు మరిన్ని గెలవాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ అనుభూతి బాగుటుంది' అని షమీ చెప్పుకొచ్చాడు.
'ఎన్నో సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నా. అనుభవం తప్పకుండా ఉపయోగపడుతుంది. నిత్యం ఆడుతుంటే నైపుణ్యాలు మెరుగుపడతాయి. అలాగే ఏ ఆటగాడైనా తన బలహీనతలను గుర్తించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా స్పెషలిస్ట్ ప్లేయర్‌గా ఎదగాలంటే బలహీనత ఏంటో గుర్తించాలి. దానిపై దృష్టి పెడితేనే సక్సెస్ సొంతం అవుతుంది. ఈ ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. మిగతా మ్యాచులలో ఇలానే రాణించేందుకు ప్రయత్నిస్తా' అని షమీ ధీమా వ్యక్తం చేశాడు. తన క్రమశిక్షణ, ఫిట్‌నెస్, అనుభవం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని షమీ స్పష్టం చేశాడు. జట్టు విజయమే తనకు ముఖ్యమని, ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆశిస్తున్నట్లు షమీ పేర్కొన్నాడు.