Mohammed Shami History: ఛీకొట్టిన జట్టునే చెడుగుడాడాడు.. ఐపీఎల్ చరిత్రలో మహ్మద్‌ షమీ అరుదైన రికార్డు!

Mohammed Shami Creates History in IPL 2026. ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పరుగులు ఇచ్చిన పేసర్ల జాబితాలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. 4 ఓవర్లు వేసి సింగిల్ డిజిట్ పరుగులు మాత్రమే ఇవ్వడం అరుదైన విషయం.

Update: 2026-04-05 13:01 GMT

Mohammed Shami

Mohammed Shami History: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుత బౌలింగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) తరఫున బరిలోకి దిగిన షమీ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు తీసి తన క్లాస్‌ను చూపించాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప పరుగులు ఇచ్చిన పేసర్ల జాబితాలో షమీ చోటు దక్కించుకున్నాడు.

సాధారణంగా ఐపీఎల్ వంటి హై స్కోరింగ్ లీగ్‌లో పరుగులు కట్టడి చేయడం పేసర్లకు చాలా కష్టం. అలాంటిది నాలుగు ఓవర్లు వేసి సింగిల్ డిజిట్ పరుగులు మాత్రమే ఇవ్వడం అరుదైన విషయం. మహ్మద్ షమీ (4-0-9-2) స్పెల్ ఈ సీజన్‌లోనే కాకుండా ఐపీఎల్ చరిత్రలో కూడా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 4 ఓవర్లు పూర్తి చేసి అత్యల్ప పరుగులు ఇచ్చిన పేసర్లలో ఫిడెల్ ఎడ్వర్డ్స్ (6 పరుగులు), ఆశిష్ నెహ్రా (6 పరుగులు)లు అగ్రస్థానంలో ఉన్నారు. లాకీ ఫెర్గ్యూసన్ (7 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. బ్రెట్ లీ, ప్రవీణ్ కుమార్, డేల్ స్టెయిన్, మిచెల్ జాన్సన్, మొహమ్మద్ సిరాజ్ 8 పరుగులు ఇచ్చి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక 9 పరుగులు మాత్రమే ఇచ్చిన జాబితాలో బ్రెట్ లీ, షాన్ పోలాక్, లసిత్ మలింగ, జహీర్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు. వీరి సరసన తాజాగా మహ్మద్ షమీ చేరాడు. ఈ గణాంకాలు షమీ స్థాయి, క్రమశిక్షణ, అనుభవాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ అద్భుత స్పెల్‌తో షమీ మ్యాచ్‌పై ప్రభావం చూపడమే కాకుండా.. తన కెరీర్‌లో గొప్ప మైలురాయిని చేరుకున్నాడు. వరుస గాయాలు, ఫిట్‌నెస్‌ కారణంగా షమీ టీమిండియాకు దూరమై చాలా కాలమే అయింది. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో వేలంలో వదిలేసింది. లక్నో కొనుగోలు చేయగా.. తన పాత జట్టునే చెడుగుడాడాడు. ప్రస్తుతం షమీ పేరు నెట్టింట మార్మోగిపోతోంది.

Tags:    

Similar News