ఐపీఎల్ స్టార్‌పై క్రిమినల్ కేసు.. ఊచలు లెక్కపెట్టే పరిస్థితిలో పంజాబ్ కింగ్స్ తోపు ప్లేయర్..!
Shashank Singh Criminal Case: క్రికెట్ పిచ్‌పై మెరుపులు మెరిపించే శశాంక్ సింగ్ అసలు స్వరూపం ఇదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ స్టార్‌పై క్రిమినల్ కేసు.. ఊచలు లెక్కపెట్టే పరిస్థితిలో పంజాబ్ కింగ్స్ తోపు ప్లేయర్..!
Shashank Singh Criminal Case: ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు షాకింగ్ న్యూస్. మైదానంలో సిక్సర్లతో అలరించిన పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ తీవ్ర చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వంట మనిషిపై భౌతిక దాడి, బంధించి వేధించడం వంటి తీవ్ర ఆరోపణలపై శశాంక్ సింగ్‌తో పాటు ఆయన తండ్రిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడింది.
ఇంటి వంట మనిషిపై నరకయాతన.. అసలేం జరిగిందంటే?
క్రికెట్ పిచ్‌పై మెరుపులు మెరిపించే శశాంక్ సింగ్ అసలు స్వరూపం ఇదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్‌ను భోపాల్‌లోని నిల్బాద్‌లో నివసిస్తున్న శశాంక్ సింగ్ తండ్రి శైలేష్ సింగ్ ఇంట్లో వంట మనిషిగా నెలకు 15 వేల రూపాయల జీతానికి కుదిర్చారు. పైగా శశాంక్ తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కావడంతో, తనకున్న బలమైన రాజకీయ, ప్రభుత్వ సంబంధాలతో విపేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు.
అయితే, పనిలో చేరిన కొద్దిరోజులకే సదరు వంట మనిషికి నరకం ముందే కనిపించింది. శశాంక్ సింగ్ కుటుంబ సభ్యులు నిరంతరం వంటను వంకలు పెడుతూ, అతడిని తీవ్రంగా దూషించడం మొదలుపెట్టారు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక విపేంద్ర సింగ్ ఉద్యోగం మానేసి తన స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పయింది.
బందీగా మార్చి.. చిత్రహింసలు..
ఉద్యోగం మానేస్తానని చెప్పిన విపేంద్రపై క్రికెటర్ శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి డ్రైవర్‌తో కలిసి విపేంద్రను ఒక గదిలో బంధించి, తీవ్రంగా కొట్టారు. అతడి మొబైల్ ఫోన్‌ను లాక్కొని, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న విపేంద్ర రాతిబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ముఖం, శరీరంపై ఉన్న గాయాలను చూసిన పోలీసులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి, దాడి నిజమేనని నిర్ధారించారు.
నమోదైన తీవ్రమైన చట్టపరమైన సెక్షన్లు..
బాధితుడి వాంగ్మూలం, వైద్య నివేదికల ఆధారంగా రాతిబాద్ పోలీసులు శశాంక్ సింగ్, ఆయన తండ్రిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద మూడు తీవ్రమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
సెక్షన్ 296 (B): బహిరంగంగా బూతులు తిట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించడం.
సెక్షన్ 115 (2): వ్యక్తిగతంగా తీవ్రమైన శారీరక దాడికి పాల్పడటం.
సెక్షన్ 3 (5): ఒకే ఉద్దేశంతో గ్రూపుగా ఏర్పడి నేరానికి పాల్పడటం (ఉమ్మడి క్రిమినల్ బాధ్యత).
ప్రమాదంలో ఐపీఎల్ కెరీర్.. పంజాబ్ కింగ్స్ ఏం చేయనుంది?
గత ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ శశాంక్ సింగ్‌ను 5.5 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుంది (రిటైన్ చేసుకుంది). అయితే 2026 ఐపీఎల్ సీజన్ అతడికి అస్సలు కలిసిరాలేదు. పేలవమైన ఫీల్డింగ్, ఘోరమైన బ్యాటింగ్ ఫామ్‌తో 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 132 పరుగులు మాత్రమే చేసి జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు.
ఇలాంటి ఫ్లాప్ షో తర్వాత, ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు నమోదు కావడంతో 2027 ఐపీఎల్ వేలంలో అతడిని కొనేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపే అవకాశం లేదు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తే తప్ప అతడు మైదానంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల యష్ దయాల్ ఎలాగైతే ఐపీఎల్‌కు దూరమయ్యాడో, ఇప్పుడు శశాంక్ సింగ్ కెరీర్ కూడా అలాగే ముగిసిపోయేలా కనిపిస్తోంది.
మైదానంలో ఎంత గొప్ప ఆటగాడైనా, నిజ జీవితంలో చట్టాన్ని, తోటి మనుషులను గౌరవించకపోతే కెరీర్ ఎలా తలకిందులవుతుందో చెప్పడానికి శశాంక్ సింగ్ ఉదంతమే ఉదాహరణ. పరువుతో పాటు కోట్లాది రూపాయల క్రికెట్ భవిష్యత్తును ఈ స్టార్ బ్యాటర్ స్వయంకృతాపరాధంతో బూడిదలో పోసిన పన్నీరు చేసుకున్నాడు.