IPL 2026 : చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సిక్సర్ల జాతర.. చెన్నైపై 43 పరుగుల తేడాతో భారీ విజయం
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 250 పరుగుల భారీ స్కోరు సాధించి, 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి నంబర్-1గా నిలిచింది.
RCB Crushes CSK
IPL 2026 : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అస్సలు ఆగుతలేదు. ప్రస్తుత ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. తన వికృత రూపాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై చూపించింది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రజత్ పాటిదార్ సేన చెన్నైని 43 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, బౌలింగ్‌లోనూ పంజా విసిరి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గత సీజన్ వరకు సొంత గడ్డపై తడబడిన బెంగళూరు, ఈసారి మాత్రం చిన్నస్వామి స్టేడియాన్ని కోటలా మార్చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) అదిరిపోయే పునాది వేశారు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (50) తన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. అయితే అసలైన విధ్వంసం ఆఖరి 5 ఓవర్లలో మొదలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్, ట్రిమ్ డేవిడ్ కలిసి చెన్నై బౌలర్లను ఊచకోత కోశారు. కేవలం 30 బంతుల్లోనే వీరిద్దరూ 97 పరుగులు పిండుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్‌కే హైలైట్ ట్రిమ్ డేవిడ్ ఇన్నింగ్స్. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులు చేసిన డేవిడ్.. తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. అటు కెప్టెన్ పాటిదార్ కూడా తక్కువ తినలేదు.. కేవలం 19 బంతుల్లోనే 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం.
251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7), సంజూ శామ్సన్ (9) ఘోరంగా విఫలమయ్యారు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సిఎస్‌కేను సర్ఫరాజ్ ఖాన్ (50) మెరుపు హాఫ్ సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కృనాల్ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. చివర్లో ప్రశాంత్ వీర్ (43), జేమీ ఓవర్టన్ (37) కొంచెం పోరాడినా.. భువనేశ్వర్ కుమార్ తన అనుభవంతో మూడు కీలక వికెట్లు తీసి ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరుకు వరుసగా ఇది నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ నుంచి మళ్లీ నంబర్-1 స్థానాన్ని ఆర్సీబీ లాగేసుకుంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు 3 వికెట్లు దక్కగా.. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమష్టిగా రాణిస్తున్న ఆర్సీబీని చూస్తుంటే ఈసారి కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.