గద్దర్ అవార్డుకు ‘వనజీవి రామయ్య’ బయోపిక్ ఎంపిక.. వెండితెరపై కోటి మొక్కల రామయ్య స్ఫూర్తి!
Vanajeevi Ramaiah Biopic: కోటి మొక్కలు నాటి ‘వనజీవి’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవిత కథ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టిస్తోంది.
గద్దర్ అవార్డుకు ‘వనజీవి రామయ్య’ బయోపిక్ ఎంపిక.. వెండితెరపై కోటి మొక్కల రామయ్య స్ఫూర్తి!
Vanajeevi Ramaiah Biopic: కోటి మొక్కలు నాటి ‘వనజీవి’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవిత కథ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టిస్తోంది. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘గద్దర్ అవార్డుల్లో’ ఉత్తమ లఘు చిత్రాల (Best Short Film) విభాగంలో ఎంపికైంది.
ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన:
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రత్యేక ప్రివ్యూను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. రామయ్య గారి పర్యావరణ స్పృహను భావి తరాలకు అందించడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తుందని వారు కొనియాడారు.
భారతీయ భాషల్లో విడుదల:
నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ వెల్లడించారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదంతో జీవితాంతం మొక్కలు నాటిన రామయ్య గారి సేవలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి చాటిచెబుతామని దర్శకుడు వేముగంటి తెలిపారు. బల్లేపల్లి మోహన్ అందించిన సంగీతం ఈ బయోపిక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తరతరాలకు మార్గదర్శి:
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణే శ్వాసగా బతికారు. శుభకార్యాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం, విత్తనాలను సేకరించి అడవుల్లో చల్లడం వంటి పనులతో ఆయన పర్యావరణ యోధుడిగా నిలిచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, ఈ బయోపిక్ ద్వారా ఆయన స్ఫూర్తి నిరంతరం కొనసాగుతుందని చిత్ర బృందం పేర్కొంది.