Dhurandhar The Revenge Movie Review : రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం ..ఇది కదా అసలైన ‘రా’ సినిమా..!
రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ సినిమా రివ్యూ ఇక్కడ చూడండి.
Dhurandhar The Revenge Movie Review : రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం ..ఇది కదా అసలైన ‘రా’ సినిమా..!
Dhurandhar The Revenge Movie Review :బాలీవుడ్ స్టార్ హీరో నటించిన ధురంధర్ పార్ట్ 1 సూపర్ హిట్ సాధించడంతో 'ధురంధర్: ది రివెంజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ వెండితెరపై యాక్షన్ స్పై థ్రిల్లర్లకు కొత్త అర్థాన్ని చెబుతూ, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది 'ధురంధర్: ది రివెంజ్'. భారీ అంచనాల మధ్య గురువారం(మార్చి 19) నాడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథ
పాకిస్థాన్‌లోని కరాచీ నగరం.. అక్కడి నేతలను సైతం గడగడలాడించే హమ్జా ఆలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) ఒక అండర్ డాగ్‌గా మొదలై, అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి చేరుకుంటాడు. కానీ, ఈ హమ్జా అసలు పేరు జస్కిరాత్ సింగ్ రాంగీ. భారత్ నుంచి వెళ్ళిన ఒక సీక్రెట్ ఏజెంట్. భారత్‌లోకి అక్రమ ఆయుధాలు, నకిలీ కరెన్సీని పంపిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే తీవ్రవాద సంస్థలకు, వారికి సహకరించే లోకల్ నేతలకు చెక్ పెట్టడమే జస్కిరాత్ లక్ష్యం. ఈ క్రమంలోనే కరాచీలో దాక్కున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) పంపిన ఈ ఏజెంట్, తన మిషన్‌ను ఎలా పూర్తి చేశాడు? అసలు జస్కిరాత్ గతం ఏమిటి? అన్నదే ఈ సినిమా అసలు సిసలైన కథ.
స్క్రీన్ ప్లే మ్యాజిక్
సుమారు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, దర్శకుడు ఆదిత్య ధార్ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా బోర్ కొట్టనివ్వదు.
ఫస్టాఫ్: సినిమా మొదలైన మొదటి 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఒక బ్లాక్ బస్టర్ వాతావరణాన్ని సెట్ చేస్తుంది. ఫ్యామిలీ డ్రామా మరియు ఎస్పీ చౌదరీ అస్లాం (సంజయ్ దత్) ఎపిసోడ్లు సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సెకండాఫ్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది.
సెకండాఫ్: ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, నోట్ల రద్దు వెనుక ఉన్న సీక్రెట్ ఆపరేషన్, యూపీ రాజకీయాల్లో క్రిమినల్స్ పాత్ర వంటి అంశాలను దర్శకుడు డీల్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా ఐఎస్ఐ స్థావరాలను ధ్వంసం చేసే సీన్లు దేశభక్తిని అమాంతం పెంచేస్తాయి.
రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో
ఈ సినిమాను రణ్‌వీర్ సింగ్ తన భుజాల మీద మోశాడు. జస్కిరాత్ సింగ్‌గా, హమ్జాగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో రణ్‌వీర్ నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్లలో ఆయన చూపించిన ఎనర్జీ, ఎమోషనల్ సీన్లలో పండించిన డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రణ్‌వీర్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు.
ఇతర నటీనటుల ప్రతిభ:
సంజయ్ దత్ తనదైన గంభీరమైన నటనతో పాత్రకు నిండుదనాన్ని తెచ్చారు.సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహించే ఆఫీసర్లుగా ఆర్ మాధవన్ & అర్జున్ రాంపాల్ తమ అనుభవాన్ని వెండితెరపై పండించారు. విలనిజంలో అక్షయ్ ఖన్నా కొత్త కోణాన్ని చూపిస్తూ మెప్పించారు.
హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఎడిటింగ్. అంత పెద్ద నిడివి ఉన్న సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా శివకుమార్ పానికర్ ఎడిట్ చేసిన తీరు ప్రశంసనీయం. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫీ కరాచీ వీధులను, యాక్షన్ ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయి.బలమైన డైలాగ్స్, ఊహించని ట్విస్టులు, దేశభక్తిని రగిలించే సన్నివేశాలతో 'ధురంధర్: ది రివెంజ్' ఒక కంప్లీట్ ప్యాకేజీ. థియేటర్లో చూసినప్పుడు కలిగే ఆ ఎక్స్‌పీరియెన్స్ మాటల్లో చెప్పలేం. మీరు యాక్షన్ సినిమాలను ఇష్టపడితే, కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
రేటింగ్: 3.5/5