Ustad Bhagat Singh Review: పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో అభిమానులను అలరించిందా?
Ustad Bhagat Singh Review: ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అభిమానులను అలరించిందా? సినిమా ఎలా ఉంది?
Ustad Bhagat Singh Review
Ustad Bhagat Singh Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినపుడే పెద్ద హైప్ క్రియేట్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. గబ్బర్ సింగ్ లాంటి మూవీ తరువాత పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటే ఫాన్స్ లో ఒకరకమైన జోష్ వచ్చింది. అయితే, మూవీ షూటింగ్ చాలాకారణాలతో ఆలస్యం అయింది. ఆలస్యం అయిన కొద్దీ ఏ సినిమా పైన తగ్గుతుంది జనాలకు. కానీ ఉస్తాద్ విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకుని మూవీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి అందరిలోనూ ఇంట్రస్ట్ క్రియేట్ అయింది. చాలాకాలం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మూవీ కావడం.. ట్రైలర్ బావుండడంతో పాటు అందులో వినిపించిన పంచ్ డైలాగులు ప్రేక్షకులకు ఉస్తాద్ పై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. ఆ అంచనాల మధ్య ఉగాది కానుకగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి అందరి అంచనాలను ఈ మూవీ అందుకుందా? హరీష్..పవన్ కాంబినేషన్ మళ్ళీ మేజిక్ చేసిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
ఉస్తాద్ భగత్ సింగ్ ఒక అభిమాని దర్శకుడిగా తన అభిమాన హీరోతో చేసిన సినిమా. ఇదొక్క మాట చాలు సినిమా పై ఆ హీరో అభిమానులకు ఆసక్తి పెరగడానికి. ఈ మూవీలో దాదాపుగా ఆ మ్యాజిక్ కనిపించలేదు. అక్కడక్కడా తప్ప పవన్ రేంజికి తగ్గట్టుగా సీన్స్ కదల్లేదు అనిపిస్తుంది. ముందుగా కథ విషయానికి వస్తే..
ఒక గిరిజన గ్రామంలో ఒక మంచి మాస్టారు. విద్యార్థుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వారు. ఆయన ఒక అనాథను చేరదీసి గార్డియన్ గా ఉంటారు. భగత్ సింగ్ అని పేరు పెట్టి అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి ఆహ్వానం పలుకుతాడు. ఆ టీచర్ కాల క్రమంలో ముఖ్యమంత్రి అవుతారు. మరోవైపు భగత్ సింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇక ముఖ్యమంత్రి అవ్వాలని ఎదురుచూస్తున్న ఒక నాయకుడు.. బయటి శక్తులతో చేతులు కలిపి ముఖ్యమంత్రిని హత్య చేయించాలని చూస్తాడు. ఈ క్రమంలో భగత్ సింగ్ ఆ రాజకీయ నాయకుడిని ఎలా ఎదుర్కున్నాడు? వీళ్లిద్దరి మధ్య ఉన్న అసలు గొడవ ఏమిటి? ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసం భగత్ సింగ్ ఏం చేశాడు? ఇదే టూకీగా సినిమా.
ఇది పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ. ఆయన అభిమానులను అలరించడం కోసం.. తీసిన సినిమా అని మొదటి నుంచి హరీష్ శంకర్ చెబుతూ వచ్చారు. ఆయన అదే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. కానీ, కథలో బలం లేదు. ఎన్నోసార్లు చూసిన కథే ఇది. కనీసం కథనం అన్న బిగువుగా ఉందా అంటే, అది కూడా లేదు. మూవీలో సీన్స్ అన్నీ అతుకుల బొంతలా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు పూర్తిగా తుపాకీలతో నిండిపోయాయి. ఇంటర్వెల్ ముందు కొద్దిగా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ తరువాత మళ్ళీ సాగిపోతుంది. విలన్లు ఎక్కువైపోవడం.. రాజకీయాలు.. మతాలు.. దేశభక్తి.. ఇలా ఎన్నో అంశాలు ఒకేసారి పవన్ కళ్యాణ్ మూవీలో చూపించేయాలనే ఆత్రమే సినిమాలో కనిపిస్తుంది. హరీష్ శంకర్ ఒకరకంగా తాను పవన్ కళ్యాణ్ భక్తుడిలా సినిమా తీశాడని అనుకోవాలి. ఒక దర్శకుడు హీరోకి భక్తుడిగా మారితే ఇలానే ఉంటుందని అనిపిస్తుంది. సినిమాలో పొరపాట్లు కనిపించవు. హీరో ఎలివేషన్.. హీరో కోసమే అన్నట్టు ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
ఇలాంటి క్యారెక్టర్లు పవన్ కళ్యాణ్ కు కొట్టిన పిండి. ఇలా వచ్చి అలా చేసేశారు. శ్రీలీలకు పిచ్చి డ్యాన్సుల నుంచి తప్పించి కాస్త అవకాశం ఉన్న పాత్ర దొరికింది. బాగానే చేసింది. రాశీ ఖన్నా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో ఫర్వాలేదు. ఇక మెయిన్ విలన్ గా పార్తీపన్ నటన బావుంది. మిగిలిన వారంతా పాత్రల పరిధి మేరకు ఒకే. గౌతమి కొన్ని సీన్లకే పరిమితం అయిపొయింది.
టెక్నీకల్ గా..
టెక్నీకల్ గా మూవీలో ఫోటో గ్రఫీ ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. మ్యూజిక్ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. సినిమాకి అది కొంతవరకూ ప్లస్ అని చెప్పాలి. ఇక దర్శకుడిగా హరీష్ శంకర్ ముందే చెప్పినట్టు పవన్ అభిమానంతో పడి గాడి తప్పినట్టు అనిపించింది. కానీ, హరీష్ తన పంచ్ డైలాగ్స్ తో మాత్రం అదరగొట్టేశారు. అక్కడక్కడా వచ్చిన డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.
మొత్తంమీద చూసుకుంటే, సినిమా అభిమానులకు కొంతవరకూ నచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే సాధారణ ప్రేక్షకుల అంచనాలకు అందడం కొంచెం కష్టమనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం మూవీలో కొన్ని వావ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఆయన వీరాభిమానులకు నచ్చే ఛాన్స్ ఉంది.
చివరిగా ఒక మాట ఈ మూవీ చూస్తుంటే అంకుశం లాంటి సినిమాలు గుర్తుకువస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు.
గమనిక: ఈ రివ్యూ రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సినిమా చూడాలని కానీ, చూడొద్దని కానీ చెప్పడం ఈ రివ్యూ ఉద్దేశ్యం కాదు. కేవలం ఆసక్తి కల పాఠకుల కోసం దీనిని ఇక్కడ ఇవ్వడం జరిగింది.