Vikarabad: హరీష్ రావు టూర్ కు బ్రేక్? పరిగిలో ఉద్రిక్తత!
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత! మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు అనుమతి కోరగా రాపోల్ సర్పంచ్‌ను పోలీసులు నిర్బంధించారు.
Vikarabad: హరీష్ రావు టూర్ కు బ్రేక్? పరిగిలో ఉద్రిక్తత!
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వేదికగా ఈరోజు హైడ్రామా నడిచింది. భూ నిర్వాసితుల పక్షాన నిలబడేందుకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు అనుమతి కోరడం ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. పర్మిషన్ కోసం వెళ్లిన గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారన్న వార్తతో పరిగి ఒక్కసారిగా వేడెక్కింది.
రేపు రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లోని భూ బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. ఈ పర్యటనకు పోలీసుల అనుమతి కోరేందుకు రాపోల్ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
అనుమతి ఇవ్వకపోగా, లోపలికి వెళ్లిన గ్రామస్తులను, సర్పంచ్‌ను బయటకు రాకుండా పోలీసులు స్టేషన్ గేట్లు వేసి లోపలే ఉంచారని తెలుసుకున్న గ్రామస్తులు ,గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్టేషన్ గేటు బయట రోడ్డుపైనే బైఠాయించారు. "మా వారిని బయటకు వదలాలి.. హరీష్ రావు పర్యటనకు అనుమతి ఇవ్వాలి" అంటూ నినాదాలతో హోరెత్తించారు.
దాదాపు గంట సేపు ఉత్కంఠ కొనసాగిన తర్వాత, పోలీసులు సర్పంచ్‌ను , లోపల ఉన్న గ్రామస్తులను బయటకు పంపారు. తమ వారు క్షేమంగా బయటకు రావడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏది ఏమైనా, హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.