No Kings Rally: ఏకంగా 80 లక్షల మంది.. నిరసన సెగల్లో ట్రంప్..
No Kings Rally: అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై నిరసన పెరుగుతోంది. నో కింగ్స్ ర్యాలీ పేరుతొ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో 80 లక్షల మంది పాల్గొన్నారు.
No Kings Rally
No Kings Rally: అమెరికాలో అధ్యక్షుడుట్రంప్‌నకు వ్యతిరేకంగా జరిగిన 'నో కింగ్స్ ర్యాలీ'లో ఎనిమిది మిలియన్ల మంది పాల్గొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, శనివారం(అక్కడి కాలమానం ప్రకారం) ఈ ప్రదర్శనలు 50 రాష్ట్రాలలో 3,300కు పైగా ప్రదేశాలలో జరిగాయి. గత అక్టోబర్‌లో జరిగిన ‘నో కింగ్స్’ ప్రదర్శనలతో పోలిస్తే, ఈసారి సుమారు 10 లక్షల మంది అదనంగా హాజరయ్యారని, అలాగే దాదాపు 600 అదనపు కార్యక్రమాలు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.
ట్రంప్ పరిపాలనలోని పలు విధానాలపై తాము ఆగ్రహంగా ఉన్నామని నిరసనకారులు చెబుతున్నారు. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, కఠినమైన వలసల అమలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రదేశాలలో, ప్రజలు ట్రంప్ - ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌లను విమర్శిస్తూ, వారిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ పోస్టర్లను ప్రదర్శించారు.
ప్రజలకేమీ ఇబ్బంది లేదు: వైట్ హౌస్
కాగా, ఈ నిరసనల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని వైట్ హౌస్ తెలిపింది. వైట్ హౌస్ ఈ నిరసనలను "థెరపీ సెషన్లు"గా అభివర్ణించింది. ఇవి సాధారణ ప్రజలపై పెద్దగా ప్రభావం చూపవని పేర్కొంది. మరోవైపు, ట్రంప్ తన నిర్ణయాలు దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్నవని వాదిస్తున్నారు. తాను "రాజు"ను కానని, తనపై ఉన్న ఆరోపణలు అవాస్తవమని కూడా ఆయన పదే, పదే చెబుతూ వస్తున్నారు.
ట్రంప్‌పై ఆగ్రహం అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా వ్యక్తమైంది. పారిస్, లండన్, లిస్బన్ వంటి నగరాల్లో ప్రజలుట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు.
వివిధ రాష్ట్రాల్లో నిరసనల తీరిది..
- మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ - సెయింట్ పాల్ నగరాల్లో సుమారు 2 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
- న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్- మాన్‌హాటన్ ప్రాంతంలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు పలు వీధులను మూసివేయాల్సి వచ్చింది.
- చాలా మంది నిరసనకారులు ట్రంప్ ఫోటో, దానిపై "ఎప్స్టీన్" అని రాసి ఉన్న పోస్టర్లను ఊపారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లలో ట్రంప్ పేరు పలుమార్లు కనిపిస్తుంది.
- చికాగోలో కూడా వేలాది మంది ప్రజలు "ట్రంప్‌ను తొలగించండి" వంటి నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం మరింత బలపడుతోందని మేయర్ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
- రాజధాని వాషింగ్టన్ డిసిలో, ప్రజలు 'లింకన్ మెమోరియల్' - 'నేషనల్ మాల్' చుట్టూ గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో జరిగిన నిరసన అనంతరం, పోర్ట్‌లాండ్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (ICE) కార్యాలయం వెలుపల అమెరికా జెండాను తగులబెట్టారు.
- అమెరికా వ్యాప్తంగా నిరసనలు చాలా వరకు శాంతియుతంగానే కొనసాగాయి, కానీ లాస్ ఏంజిల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, నిరసనకారులు - పోలీసుల మధ్య ఘర్షణలకు దారితీసింది, ఫలితంగా పలువురిని అరెస్టు చేశారు.