World Largest Warship : యుద్ధనౌకకే చుక్కలు చూపించిన టాయిలెట్లు.. అమెరికా మహా నౌకలో వింత కష్టాలు

World Largest Warship : ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ 9 నెలల మిషన్ తర్వాత క్రొయేషియాకు చేరింది. అగ్నిప్రమాదం, టాయిలెట్ల సమస్యల కారణంగా దీనికి మరమ్మతులు నిర్వహించనున్నారు.

Update: 2026-03-29 02:41 GMT

World Largest Warship

World Largest Warship : అగ్రరాజ్యం అమెరికా గర్వకారణంగా చెప్పుకునే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ (USS Gerald R. Ford) సుదీర్ఘ మిషన్ తర్వాత విశ్రాంతి కోసం తీరానికి చేరింది. సుమారు 9 నెలల పాటు సముద్రంపై నిరంతరాయంగా పహారా కాసిన ఈ నౌక, శనివారం మరమ్మతుల నిమిత్తం క్రొయేషియాలోని స్ప్లిట్ ఓడరేవుకు చేరుకుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యలు, రెడ్ సీలో ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన ఈ యుద్ధనౌక, ఇప్పుడు సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం నాటో సభ్యదేశమైన క్రొయేషియా ఆశ్రయం పొందుతోంది.

USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ గత తొమ్మిది నెలలుగా విశ్రాంతి లేకుండా పని చేస్తోంది. ఇరాన్ వ్యతిరేక ఆపరేషన్లు, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మద్దతుగా రెడ్ సీ (ఎర్ర సముద్రం)లో ఇది కీలక పాత్ర పోషించింది. అయితే, మార్చి 12న ఈ నౌకలో ఒక అనూహ్య ఘటన జరిగింది. శత్రువుల దాడి వల్ల కాకుండా, అంతర్గత కారణాల వల్ల నౌకలోని లాండ్రీ రూమ్‌ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటలను అదుపు చేయడానికి సిబ్బందికి గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు గాయపడగా, పొగ వల్ల దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. నౌకలోని సుమారు 100 నిద్రించే గదులు కూడా ఈ ప్రమాద ప్రభావానికి గురయ్యాయి.

టాయిలెట్ల సమస్య.. ప్లంబింగ్ కష్టాలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధనౌక అయినప్పటికీ, ఇందులో కొన్ని వింతైన సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ భారీ నౌకలో ఉన్న దాదాపు 650 టాయిలెట్లు తరచూ పాడైపోతున్నాయి. అధునాతన వ్యాక్యూమ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ప్లంబింగ్ సమస్యల వల్ల సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిరంతరం సముద్రం మీద ఉండటం వల్ల యంత్రాలు మొరాయించడం, వేల మంది సైనికుల అవసరాలు తీర్చడం ఈ నౌకకు సవాలుగా మారింది. అందుకే ఇప్పుడు క్రొయేషియాలో వీటన్నింటినీ చక్కదిద్దనున్నారు.

నౌకపై సైనిక సంపద.. ఒక చిన్న నగరంలాంటిదే

ఈ యుద్ధనౌక శక్తి సామర్థ్యాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీనిపై ఏకకాలంలో 5,000 మందికి పైగా సైనికులు నివసించవచ్చు. ఇందులో 75కు పైగా అత్యాధునిక యుద్ధ విమానాలు ఉంటాయి, ముఖ్యంగా శక్తివంతమైన F-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఇది అణు ఇంధనంతో నడుస్తుంది, అంటే ఒక్కసారి ఇంధనం నింపితే దశాబ్దాల పాటు సముద్రం మీద ఉండగలదు. ఇందులో ఉండే రాడార్ వ్యవస్థ గగనతలం నుంచి వచ్చే శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టగలదు.

నాటో దేశంతో అమెరికా వ్యూహాత్మక బంధం

క్రొయేషియా నాటోలో సభ్యదేశం కావడంతో, అమెరికా యుద్ధనౌకకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన కేవలం మరమ్మతుల కోసమే కాకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. నౌక మరమ్మతులు జరుగుతున్న సమయంలో క్రొయేషియాకు చెందిన కీలక నాయకులు, అధికారులను నౌకపైకి ఆహ్వానించి లోపల ఉన్న సాంకేతికతను చూపించనున్నారు. అమెరికా వద్ద ఉన్న మొత్తం 11 యుద్ధనౌకల్లో ఇది అత్యంత కొత్తది, కీలకమైనది కావడం విశేషం.

Tags:    

Similar News