Crude Oil Price : ప్రపంచానికి చమురు సెగ.. బ్యారెల్ ధర $200కు చేరుతుందా?

Crude Oil Price :ఇరాన్-అమెరికా యుద్ధంతో ప్రపంచానికి చమురు సెగ తగలబోతుందా. హోర్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరుతుందా? చైనా నౌకల అడ్డగింత, ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 10 రోజుల డెడ్‌లైన్ వంటి కీలక పరిణామాల పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-28 10:50 GMT

Crude Oil Price : ఇరాన్ - అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని ద్రవ్యోల్బణ కోరల్లోకి నెట్టేస్తోంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో చిచ్చు రేపుతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ తాజాగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. ఇరాన్‌తో ఘర్షణ జూన్ వరకు కొనసాగి, హోర్ముజ్ జలసంధి మూసివేసి ఉంటే, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లకు పెరిగే అవకాశం 40% ఉందని హెచ్చరించింది. ఇదే జరిగితే నిత్యావసర వస్తువుల నుంచి రవాణా వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ నెలాఖరుకల్లా ఉద్రిక్తతలు సద్దుమణిగే అవకాశం 60% ఉందని బ్లూమ్‌బెర్గ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

చైనా నౌకల అడ్డగింత.. పెరిగిన ధరలు

మార్చి 27న హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారీ చైనా నౌకలను (COSCO) ఇరాన్ అడ్డుకోవడంతో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్: 2.82% పెరిగి బ్యారెల్‌కు $111.06 కు చేరింది. WTI ఫ్యూచర్స్: 2.68% పెరిగి $97.01 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద షిప్పింగ్ సంస్థ అయిన చైనా నౌకలను వెనక్కి పంపడం, సరఫరా వ్యవస్థపై ఇరాన్ పట్టును చాటిచెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్ 10 రోజుల గడువు..

ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌కు 10 రోజుల గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేయబోదని ట్రంప్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఈ 10 రోజుల్లో ఇరాన్ సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఇచ్చిన ఈ గడువు ముగిసేలోపు ఇరాన్ తన పట్టు సడలిస్తుందా లేదా యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News