Iran Israel War : ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ పంజా.. అణు విస్ఫోటనం దిశగా యుద్ధం

Iran Israel War : ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. రేడియేషన్ ముప్పు పొంచి ఉండటంతో అరబ్ దేశాల్లో ఆందోళన మొదలైంది. యుద్ధం అణు విస్ఫోటనం దిశగా సాగుతోంది.

Update: 2026-03-29 03:55 GMT

Iran Israel War

Iran Israel War : మధ్యప్రాచ్యం ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై మునుపెన్నడూ లేనంతటి స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ గర్వకారణంగా భావించే ఐదు కీలక అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్త భయాందోళనలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ అణు కేంద్రాల నుంచి రేడియేషన్ గనక లీక్ అయితే, అది హిరోషిమా, నాగసాకి కంటే భయంకరమైన వినాశనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు పక్కా స్కెచ్‌తో ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా అరాక్, అర్దకాన్, ఇస్ఫహాన్, నతాంజ్, బుషెహర్ వంటి కీలక అణు ప్రాంతాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి చేసే నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల వల్ల ఇరాన్ అండర్ గ్రౌండ్ అణు నిర్మాణాలు ఏ మేరకు దెబ్బతిన్నాయనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ లొంగిపోయే వరకు ఈ దాడులు ఆగవని అమెరికా స్పష్టం చేస్తోంది.

రేడియేషన్ ప్రళయం.. పొరుగు దేశాలకు గుండె కోత

ఒకవేళ ఈ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతింటే రేడియోధార్మికత గాలిలో కలిసే ప్రమాదం ఉంది. అలా గనక జరిగితే ఇరాన్ ఒక్కటే కాదు.. ఇరాక్, టర్కీ, అజర్బైజాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. సుమారు 500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ రేడియేషన్ ప్రభావం ఉండవచ్చని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడటమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆధునిక యుగంలో అతిపెద్ద మానవ తప్పిదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

డిమోనాపై ఇరాన్ ప్రతీకారం.. యుద్ధం ముదురుతోంది

ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు పరిశోధనా కేంద్రంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు కూడా ఈ యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్ అణు శక్తిని దెబ్బతీస్తేనే అమెరికా వెనక్కి తగ్గుతుందని ఇరాన్ భావిస్తోంది. గత 12 గంటల్లోనే ఇరుపక్షాలు కలిసి 6 అణు సైట్లపై దాడులు చేసుకోవడం చూస్తుంటే, ఇది కేవలం సంప్రదాయ యుద్ధంలా కాకుండా అణు యుద్ధంలా మారుతోందని అర్థమవుతోంది.

సంపూర్ణ వినాశనమే లక్ష్యమా?

ట్రంప్, నెతన్యాహు ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకోవాలని లేదా దాని అణు సామర్థ్యాన్ని నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. అణు సైట్లతో పాటు ఇరాన్‌లోని ఆయుధ గిడ్డంగులు, స్టీల్ ప్లాంట్లు మరియు ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం కోసం అమెరికా పాకులాడుతోంది. కానీ ఇరాన్ మాత్రం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. ఈ మొండితనం చివరకు అణు విస్ఫోటనానికి దారితీస్తే, ప్రపంచ పటంలో మధ్యప్రాచ్యం అనే ప్రాంతం మ్యాప్ లో మాత్రమే మిగిలిపోతుందేమోనన్న భయం కలుగుతోంది.

Tags:    

Similar News