US Presidential Election : ట్రంప్ పాలనతో విసిగిపోయిన జనాలు.. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. బరిలో లేడీ సింగం ?

US Presidential Election : 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి కమలా హారిస్ సిద్ధంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. 2024 ఓటమి తర్వాత మళ్ళీ వైట్ హౌస్ పీఠంపై కమలమ్మ కన్ను వేశారు.

Update: 2026-04-11 04:21 GMT

 Kamala Harris

US Presidential Election : అమెరికా రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన తదుపరి అడుగుపై క్లారిటీ ఇచ్చారు. 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ పోటీ చేసే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పౌర హక్కుల సంఘం నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్ సమావేశంలో పాల్గొన్న ఆమె, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్ సమావేశంలో రెవరెండ్ అల్ షార్ప్టన్ అడిగిన ప్రశ్నకు కమలా హారిస్ సూటిగా సమాధానం ఇచ్చారు. 2028లో మళ్ళీ అధ్యక్ష బరిలో నిలుస్తారా? అన్న ప్రశ్నకు.. ఖచ్చితంగా ఆలోచిస్తాను అని సమాధానం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ కాలేజీ.. రెండింటిలోనూ ఓడిపోయినప్పటికీ, ఆమె తన పట్టు వదల్లేదు. ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, ఓవల్ ఆఫీస్ పక్కనే గడిపిన సమయం తనను అధ్యక్ష పదవికి సమర్థురాలిని చేస్తాయని ఆమె నమ్ముతున్నారు.

సొంత పార్టీలోనే సవాళ్లు

అయితే 2028 బాట కమలా హారిస్‌కు అంత సులభం కాదు. 2024 ఓటమి తర్వాత డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు కొత్త రక్తం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జెబి ప్రిట్జ్కర్ వంటి నేతలు ఇప్పటికే అధ్యక్ష రేసులో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఓడిపోయిన నేతను మళ్ళీ అధ్యక్షురాలిగా చూడటంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కొత్త ముఖాలను కోరుకుంటే, కమలమ్మకు పార్టీలోనే నామినేషన్ దక్కడం కష్టంగా మారవచ్చు.

అనుభవమే పెట్టుబడిగా

తనపై వచ్చే విమర్శలకు కమలా హారిస్ తనదైన శైలిలో బదులిచ్చారు. నాలుగు ఏళ్ల పాటు ఉపాధ్యక్షురాలిగా ఉండి అధ్యక్ష పదవికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నానని ఆమె గుర్తు చేశారు. వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ ఆఫీస్, సిట్యుయేషన్ రూమ్ లో గడిపిన వేలాది గంటలు తనకు పరిపాలనపై పట్టు ఇచ్చాయని చెప్పారు. అధ్యక్షుడిగా ఉండటానికి ఎలాంటి క్రమశిక్షణ, ఏ తరహా నిర్ణయాధికారం కావాలో తనకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ 2028లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ప్రజల విశ్వాసం గెలుచుకోవడానికి మరింత కష్టపడతానని పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డెమోక్రాట్లు ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పుడు కమలా హారిస్ చేసిన ఈ ప్రకటన పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఆరు పదుల వయసులో ఉన్న హారిస్.. సీనియర్ లీడర్ గా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ అమెరికన్ ఓటర్లు ముఖ్యంగా మధ్యస్థ ఓటర్లు ఆమెకు మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News