Economic Crisis 2026: ఒక్క గుడ్డు రూ.1.5లక్షలు, లీటరు పాలు రూ.8లక్షలు.. పేపర్ కంటే ఛీప్ అయిన కరెన్సీ
Economic Crisis 2026: 2026 ఇరాన్ ఆర్థిక సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరింది. అక్కడ ఒక్క గుడ్డు లక్షన్నర రూపాయలు పలుకుతోంది. అమెరికా ఆంక్షల వల్ల రియాల్ విలువ కుప్పకూలింది.
Iran Economic Crisis 2026
Economic Crisis 2026: మీరు కిరాణా కొట్టుకు వెళ్లి ఒక గుడ్డు ఇవ్వమని అడిగితే, దుకాణదారుడు దాని ధర లక్ష రూపాయలు అని చెబితే ఎలా ఉంటుంది? లీటర్ పాలు 8 లక్షలు, కిలో బియ్యం 32 లక్షలు అంటే గుండె ఆగుతుందేమో కదా.. కానీ, 2026 ఏప్రిల్ నాటి ఇరాన్ లో ఇది కల కాదు.. భయంకరమైన నిజం. అమెరికా ఆంక్షలు, యుద్ధ మేఘాల మధ్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అక్కడ కరెన్సీ నోట్లు కేవలం కాగితపు ముక్కలుగా మారిపోయాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. 2026 ఏప్రిల్ నాటికి ఒక అమెరికన్ డాలర్ విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 16.5 లక్షల రియాల్స్ కు చేరుకుంది. అంటే మన భారతీయ రూపాయిలో కేవలం ఒక రూపాయి ఇస్తే, అక్కడ దాదాపు 17,200 రియాల్స్ వస్తాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఏకంగా కోటి (10 మిలియన్) రియాల్స్ నోటును ముద్రించాల్సి వచ్చింది. కానీ అంత పెద్ద నోటు అంతర్జాతీయ మార్కెట్లో కేవలం 7 డాలర్ల విలువ మాత్రమే కలిగి ఉండటం విషాదం.
ట్రంప్ ఆంక్షలు - రాతి యుగపు హెచ్చరిక
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా మాగ్జిమం ప్రెజర్ 2.0 వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ చమురు ఎగుమతులపైనే కాకుండా, వారి డ్రోన్, మిస్సైల్ వ్యవస్థలపై కూడా తీవ్రమైన ఆంక్షలు విధించింది. "ఇరాన్ వెనక్కి తగ్గకపోతే, ఆ దేశాన్ని రాతి యుగంలోకి పంపిస్తాం" అని ట్రంప్ చేసిన హెచ్చరిక ఇప్పుడు నిజమవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన సైనిక దాడులు ఇరాన్ మౌలిక సదుపాయాలను, విద్యుత్ కేంద్రాలను దెబ్బతీశాయి. దీనివల్ల సరఫరా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఆకలి కేకలు - గగనమైన నిత్యావసరాలు
ఇరాన్ వీధుల్లో ఇప్పుడు తిండి కోసం యుద్ధం జరుగుతోంది. ఒక గుడ్డు ధర సరాసరి 1.4 లక్షల రియాల్స్ కు చేరింది. డజను గుడ్లు కావాలంటే 15 లక్షల రియాల్స్ చెల్లించాలి. లీటర్ పాలు 8 లక్షలు, కిలో బియ్యం 32 లక్షలు.. ఇలా ప్రతి వస్తువు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. ప్రభుత్వం కాలా-బర్గ్ అనే ఎలక్ట్రానిక్ కూపన్ విధానాన్ని తెచ్చినప్పటికీ, సరుకులు లేక ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు పేదరికంలోకి జారిపోయాయి.
డిజిటల్ ఇరాన్ - కొత్త ఆయుధం
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కరెన్సీ పడిపోయినా ఇరాన్ తన షెతబ్ నెట్‌వర్క్ ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ సేవలు లేకపోయినా, ప్రతి చిన్న కొట్టులోనూ స్వదేశీ డెబిట్ కార్డ్ మిషన్లు ఉన్నాయి. లక్షలు, కోట్లలో ఉండే రియాల్స్ లెక్కలను సులభం చేయడానికి ప్రజలు తోమాన్ అనే పదాన్ని వాడుతున్నారు. 10 రియాల్స్ ను ఒక తోమాన్ గా పరిగణిస్తారు. నోట్లపై సున్నాలను ప్రభుత్వం మసకగా ముద్రించడం ద్వారా ప్రజల్లో లక్షల భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
క్రిప్టో - చివరి ఆశ
సొంత కరెన్సీపై నమ్మకం పోవడంతో ఇరాన్ ప్రజలు బిట్‌కాయిన్, టెథర్ వంటి క్రిప్టో కరెన్సీల వైపు మళ్లుతున్నారు. సుమారు 25% మంది ఇరాన్ వాసులు ఇప్పుడు డిజిటల్ కరెన్సీల ద్వారానే తమ పొదుపును కాపాడుకుంటున్నారు. అటు ప్రభుత్వం కూడా చమురు వ్యాపారం కోసం చైనా పేమెంట్ సిస్టమ్, క్రిప్టోలను వాడుతోంది. చివరి అస్త్రంగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని మూసివేస్తామని, ఆ మార్గం గుండా వెళ్లే నౌకలపై భారీ ఫీజులు వసూలు చేస్తామని ప్రపంచ దేశాలను బెదిరిస్తోంది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోయే ప్రమాదం ఉంది.