Donald Trump : ఇరాన్ వసూళ్ల దందా ఆపాల్సిందే.. లేదంటే పరిణామాలు తీవ్రం.. ట్రంప్ వార్నింగ్
Donald Trump : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అక్రమ వసూళ్లపై డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. పాకిస్థాన్ వేదికగా ఏప్రిల్ 11న అమెరికా-ఇరాన్ కీలక చర్చలు జరుగనున్నాయి. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాంతి చర్చలకు ముహూర్తం ఖరారు.
Donald Trump
Donald Trump : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ చేస్తున్న దందాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల నుంచి ఇరాన్ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. "ఇది చాలా సిగ్గుచేటు.. ఇలాంటి పనులు మా ఒప్పందానికి విరుద్ధం. ఇరాన్ వెంటనే ఈ వసూళ్లు ఆపేయాలి" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా హెచ్చరించారు. యుద్ధ విరామం అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్ ఇలాంటి పనులకు పాల్పడటంపై ఆయన తన అసమ్మతిని వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ వేదికగా చర్చలు
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం అమెరికా నుంచి ఇప్పటికే 30 మంది సభ్యుల బృందం పాకిస్థాన్ చేరుకుంది. అటు నాటో (NATO) దేశాలు కూడా హోర్ముజ్ జలసంధి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ట్రంప్ కోరుతున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించారు.
లెబనాన్‌తో ఇజ్రాయెల్ చర్చలు
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా శత్రు దేశంగా ఉన్న లెబనాన్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ఆయన ఆమోదం తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాదులను నిరాయుధులను చేయడం, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా వాషింగ్టన్ వేదికగా వచ్చే వారం ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, హిజ్బుల్లాపై దాడులు మాత్రం ఆపేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.
శాంతి ఒప్పందంపై సందేహాలు
ట్రంప్ తాజా వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో శాంతి ఒప్పందం పటిష్టతపై సందేహాలను కలిగిస్తున్నాయి. ఇరాన్ తన సైనిక పట్టును హోర్ముజ్ జలసంధిపై కొనసాగించడం ట్రంప్‌కు అస్సలు ఇష్టం లేదు. రవాణా నౌకల నుంచి ఆదాయం పెంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇస్లామాబాద్ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.