US Iran Ceasefire Tensions: ఆదిలోనే ఒప్పందానికి తూట్లుః రూటు మారుతున్న యుద్ధం - ట్రంప్‌ ట్వీట్‌ కలకలం

US Iran Ceasefire Tensions: పశ్చిమాసియాలో యుద్ధం ఆగిందనే ఊపిరి పీల్చుకునేలోపే… పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Update: 2026-04-08 06:50 GMT

US Iran Ceasefire Tensions

US Iran Ceasefire Tensions: పశ్చిమాసియాలో యుద్ధం ఆగిందనే ఊపిరి పీల్చుకునేలోపే… పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే, ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలు ఆ ఒప్పందంపై సందేహాలు పెంచుతున్నాయి. ఒప్పందం ప్రారంభ దశలోనే తూట్లు పొడిచినట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

లెబనాన్‌పై దాడులు

గత 48 గంటల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రంగా పెరిగాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో హెజ్బొల్లా స్థావరాలపై లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల వెనుక ప్రధాన కారణం ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలిటెంట్ గ్రూప్‌లను బలహీనపరచడం. అయితే ఇదే అంశం ఇప్పుడు పెద్ద రాజకీయ సమస్యగా మారింది. ఎందుకంటే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఇలాంటి చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. దేశ భద్రత కోసం ఈ చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్‌తో అమెరికా ఒప్పందానికి తమ దాడులకు సంబంధం లేదని చెబుతున్నారు. కానీ విశ్లేషకుల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఈ దాడుల ద్వారా ఇరాన్‌ను రెచ్చగొట్టి, శాంతి ప్రక్రియను దెబ్బతీయాలని చూస్తోందని భావిస్తున్నారు.

నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా

ఇజ్రాయిల్‌ చర్యలను ఇరాన్‌ గట్టిగా తిప్పికొట్టింది. లెబనాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలను ఉద్దేశపూర్వకంగా భంగం చేస్తున్నారని ఆరోపించింది. ఇదే సమయంలో అమెరికా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్ని పక్షాలకు సూచించింది. అయితే పరిస్థితి అంత సులభంగా చల్లబడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మరింత కలకలం రేపింది. ఈరోజు ఉదయం 9:31 గంటలకు ట్రూత్‌ పోస్ట్‌లో ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ శాంతికి సిద్ధమైందని, హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో అమెరికా పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో భారీ ఆర్థిక లాభాలు సాధ్యమని సంకేతాలు ఇచ్చారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ

ట్రంప్ వ్యాఖ్యలను విశ్లేషిస్తే మూడు ముఖ్యాంశాలు బయటపడుతున్నాయి. ఇరాన్‌ను లొంగిపోయిన దేశంగా చూపించాలని ట్రంప్‌ చూస్తున్నాడు. హోర్ముజ్‌ జలసంధిపై అమెరికా పెత్తనం చెలాయించాలని చూస్తోంది. నౌకల రవాణాపై విధించే టోల్‌ఫీజులో వాటాను పొందాలని అనుకుంటున్నాడు. తద్వారా భారీ ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు అంశాలు ఇరాన్‌కు అసహనంగా మారే అవకాశముంది. ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఈ మార్గంపై నియంత్రణ ఎవరిది అన్నది గ్లోబల్ ఎకానమీపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ప్రాంతం చుట్టూ ఉద్రిక్తత పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నది పూర్తిస్థాయి ఒప్పందం కాదు..కేవలం తాత్కాలిక విరామమే. రెండు వారాల తరువాత జరిగే చర్చలే భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు, ట్రంప్‌ వ్యాఖ్యలు, ఇరాన్‌ ప్రతిస్పందన చూస్తే పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉందని అర్ధమౌతున్నది. మొత్తంగా చూసుకుంటే యుద్ధం ఆగినట్లే కనిపించినా... అంతర్గతంగా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఎవరు ఎలాంటి తప్పు చేసినా, లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మరలా పశ్చిమాసియా భగ్గుమనక తప్పదు.

Tags:    

Similar News