US Pilot Rescue in Iran: ఇరాన్ గడ్డపై నుంచి అమెరికా పైలట్‌ను సైన్యం ఎలా కాపాడిందో తెలిస్తే షాకవుతారు
ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా సైనికుడు ప్రాణాలకు తెగించి ఎలా బయటపడ్డాడో తెలిస్తే నిజంగా షాకువుతారు.
US Pilot Rescue in Iran
US Pilot Rescue in Iran: ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఏ సినిమా కథో కాదు...రియల్‌గా జరిగిన సంఘటన. మనకు తెలియని ప్రదేశంలో లేదా శతృవులు ఉన్న ప్రదేశంలో అనుకోకుండానో లేక విధిరాత బాగోలేకో ఉండాల్సి లేదా దిగవలసి వస్తే అక్కడి నుంచి ఎలా బయటపడాలన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా సైనికుడు ప్రాణాలకు తెగించి ఎలా బయటపడ్డాడో తెలిస్తే నిజంగా షాకువుతారు.
ఒంటరిపోరాటం
ఉన్నది శతృవుల ఇలాకాలో. చుట్టూ తుపాకులు పట్టుకున్న వేటగాళ్లు. ఏ క్షణంలో ఎటునుంచి బుల్లెట్లు దూసుకొస్తాయో తెలియదు. ఏమరుపాటుగా ఉంటే లిప్తపాటులో ప్రాణాలు పోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా పలాయనం లేదా ఆత్మహత్య చేసుకోవాలని మెదడు సూచిస్తుంది. కానీ, ఆ సైనికుడు మెదడు చెప్పింది కాదని, ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. అసాధారణమైన పట్టుదలతో మృత్యువును కూడా జయించాడు.
అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎఫ్ 15 ఈ యుద్ధవిమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేశాయి. అయితే, అందులోని సెకండ్ పైలట్ తన పారాచూట్ సహాయంతో ఇరాన్ పర్వత ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాడు. యుద్ధసమయంలో ఇరాన్‌లో చిక్కుకుంటే అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. విదేశీ సైనికుడు అందులోనూ శతృవు చేతికి చిక్కితే ఊరుకుంటారా చెప్పండి. పారాచూట్ నుంచి సురక్షితంగా కిందకు దిగినప్పటినుంచే అతని కోసం వేట మొదలైంది. శతృవుల కదలికలు గమనిస్తూ దగ్గరలో ఉన్న కొండ గుహలో దాక్కున్నాడు.
ప్రలోభం...గాలింపు చర్యలు
అసలే రగిలిపోతున్న ఇరాన్ అమెరికా సైనికుడిని పట్టుకుంటే 60 వేల డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది ఆ బహుమతి కోసం వందలాది మంది సైనికుడి కోసం వేట ప్రారంభించారు. అంతమందిని ఒక్కటే ఒంటరిగా ఎదుర్కోలేడు. అతని వద్ద కేవలం ఒక పిస్టల్, రేడియో కమ్యూనికేషన్ పరికరం, ట్రాకింగ్ బీకన్ మాత్రమే ఉన్నాయి. ఒకేచోట ఉంటే దొరికిపోతానని గమనించి తీవ్రమైన గాయాలతోనే 7వేల అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కాడు. బీకన్ ఆన్ చేసి ఉండటం, రేడియో సిగ్నల్స్ కోసం పర్వతాన్ని ఎక్కే సాహసమే అతని ప్రాణాలను కాపాడింది.
అమెరికా మెరుపు ఆపరేషన్
పైలట్ బీకన్ ఆన్ చేసి ఉండటంతో అమెరికా రక్షణ విభాగం అతని లైవ్ లోకేషన్‌ని ట్రాక్ చేసింది. వెంటనే సీఐఏ, ప్రత్యేక కమాండో బృందాలు భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్లాన్ చేశాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వీటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్స్, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 ప్రత్యేక రెస్క్యూ విమానాలు ఉన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ దళాలను దారి మళ్లించి, శత్రువుల కళ్ళు గప్పి పైలట్ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. నిమిషాల వ్యవధిలో అతడిని హెలికాప్టర్‌లోకి ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఆసక్తికరమైన మలుపు
ఈ ఆపరేషన్ కేవలం పైలట్‌ను కాపాడానికి మాత్రమే పరిమితం కాలేదు. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన యుద్ధ విమానం శకలాలు ఇరాన్ చేతికి చిక్కితే అందులోని టెక్నాలజీ శతృవులకు దొరికితే ఇంకేమన్నా ఉందా. కూలిన విమానాన్ని బాంబులతో పేల్చివేసి శకలాలు కూడా శతృవుల చేతికి దొరక్కుండా చేసింది. ఒక సైనికుడి ప్రాణం కోసం, తమ దేశ రహస్యాలను కాపాడుకోవడం కోసం అమెరికా ఎంతటి సాహసానికైనా సిద్దపడుతుందని ఈ ఘటనతో స్పష్టమైంది. యుద్ధ క్షేత్రంలో యంత్రాల కంటే మనిషి మేధస్సు, ధైర్యమే గొప్పవని ఆ పైలట్ నిరూపించాడు. ఇరాన్ గడ్డపై జరిగిన ఈ హై-వోల్టేజ్ డ్రామా రక్షణ రంగ నిపుణులకు ఒక కేస్ స్టడీగా మిగిలిపోయింది.