Islamabad Peace Talks: ఇస్లామాబాద్‌ శాంతి చర్చలు... సంపూర్ణమా... అసంపూర్ణమా?

Islamabad Peace Talks: ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న చర్చలు ఎంత పవిత్రమైన లక్ష్యంతో ప్రారంభమైనా… వాటి ఫలితం మాత్రం దేశాల స్వార్థాలపై ఆధారపడి ఉంటుంది.

Update: 2026-04-11 03:44 GMT

Islamabad Peace Talks: ఇస్లామాబాద్‌ శాంతి చర్చలు... సంపూర్ణమా... అసంపూర్ణమా?

Islamabad Peace Talks: ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న చర్చలు ఎంత పవిత్రమైన లక్ష్యంతో ప్రారంభమైనా… వాటి ఫలితం మాత్రం దేశాల స్వార్థాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న అమెరికా–ఇరాన్‌ శాంతి చర్చలు కూడా ఇదే సందిగ్ధ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ చర్చలు సంపూర్ణ పరిష్కారానికి దారి తీస్తాయా? లేక అసంపూర్ణంగానే మిగిలిపోతాయా? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇస్లామాబాద్ శాంతి చర్చలు: గమ్యం లేని ప్రయాణమేనా?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా లెబనాన్ ప్రాంతంలో జరుగుతున్న దాడులు, అలాగే ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్‌ చేసిన ఆస్తుల విడుదల. ఇరాన్‌ ముందుకు తెచ్చిన 10 కీలక ప్రతిపాదనల్లో ఈ రెండు అంశాలు ప్రధానంగా నిలిచాయి. ముందుగా ఈ సమస్యలకు పరిష్కారం చూపితేనే తదుపరి చర్చలు అనే దృఢమైన వైఖరితో ఇరాన్‌ ఈ చర్చలకు హాజరైంది.

అయితే, అమెరికా వైఖరి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. లెబనాన్‌పై జరుగుతున్న దాడులకు తమకు సంబంధం లేదని చెబుతూ… ముందుగా చర్చలు కొనసాగాలని సూచిస్తోంది. అంతేకాకుండా, చర్చల్లో పురోగతి లేకపోతే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరిస్తోంది. ఈ విధంగా ఒకవైపు ఒత్తిడి, మరోవైపు చర్చల ఆహ్వానం.. అమెరికా ద్వంద్వ విధానాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తోంది. అమెరికా లెబనాన్‌పై దాడుల విషయంలో సానుకూలంగా స్పందించిందని ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒక దేశం ఒక మాట, మరో దేశం మరో మాట చెప్పడం వల్ల ఈ చర్చలపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

ఇజ్రాయెల్ చిక్కుముడి

ఈ సమస్యలో మరో ముఖ్య పాత్రధారి ఇజ్రాయిల్. తన దేశ భద్రత కోసం లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలకు ఇరాన్‌ మద్దతు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ఇప్పటికే ఇరాన్‌పై యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది.

ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమెరికా ఇరాన్‌ డిమాండ్లను అంగీకరిస్తే, ఇజ్రాయిల్‌తో ఉన్న మైత్రి సంబంధాలు దెబ్బతింటాయి. ఒకవేళ ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలిస్తే, ఇరాన్‌తో చర్చలు విఫలమౌతాయి. ఈ రెండు మధ్య సమతుల్యత సాధించడం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. శాంతి చర్చలు కేవలం రాజకీయ వ్యూహాలుగా మారిపోయాయనే భావన కలుగుతోంది. శాంతి అనే లక్ష్యం ఉన్నప్పటికీ, ప్రతి దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే నిపుణులు ఈ చర్చలు పూర్తి స్థాయిలో ఫలించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచానికి శాంతి అవసరం ఎప్పటికీ ఉంటుంది. యుద్ధం ఎప్పుడూ నాశనానికే దారి తీస్తుంది. శాంతి చర్చలు ఎంత క్లిష్టంగా ఉన్నా.. వాటి ద్వారా ఒక చిన్న పరిష్కారం వచ్చినా అది గొప్పదే. మొత్తంగా చూసుకుంటే ఇస్లామాబాద్‌లో జరుగుతున్న చర్చలు ఓ పరీక్షలా మారాయని చెప్పవచ్చు. దేశాల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటేనే శాంతి సాధ్యం. లేకపోతే ఈ చర్చలు కూడా అసంపూర్ణంగా మిగిలిపోతాయి.

Tags:    

Similar News