Iran US War Updates: ఇరాన్ కీలక ఆయుధ బంకర్లపై అమెరికా భీకర దాడులు
Iran US War Updates: ఇరాన్ లోని కీలక ఆయుధ బ్యాంకర్లపై అమెరికా విరుచుకుపడింది. సోమవారం రాత్రి జరిగిన ఈ భీకర దాడుల దృశ్యాలను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Iran US War Updates
Iran US War Updates: మధ్య ప్రాచ్యంలోని యద్ధం భీకర మలుపు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఒక పక్క గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇజ్రాయేల్ పై క్షిపణులు కురిపిస్తోంది. ఇటు అమెరికా ఇరాన్ పై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.
తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న ఒక ప్రధాన ఆయుధాగారంపై అమెరికా వైమానిక దాడి చేసింది. సోమవారం రాత్రి 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించి ఈ దాడి జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఒక అమెరికా అధికారిని ఉటంకిస్తూ, భారీ పరిమాణంలో ఆయుధాలు, సైనిక సామగ్రి ఉన్న డిపోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆ నివేదిక పేర్కొంది. పటిష్టమైన, భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేయడానికి బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగిస్తారు.
డిపోలో నిల్వ ఉంచిన ఆయుధాలు పేలడంతో, ఈ దాడి అనేక పేలుళ్లకు, భారీ అగ్నిప్రమాదాలకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పేలుళ్ల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో భారీగా బ్యాంకర్లు పేలిపోతున్న శబ్దాలతో బాటు.. పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అమెరికా చేసిన దాడులకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో కనిపించిన నష్టం కన్నా తాజాగా ట్రంప్ షేర్ చేసిన వీడియోలోని దృశ్యాల్లో ఇరాన్ ఎక్కువగా నష్టపోయినట్టు కనిపిస్తోంది. ఆ వీడియోను ఇక్కడ మీరూ చూడొచ్చు.
మహల్లాట్ నగరంపై దాడిలో 11 మంది మృతి..
ఇదిలా ఉండగా ఇరాన్‌లోని మార్కాజీ ప్రావిన్స్‌లోని మహల్లాట్ నగరంలో జరిగిన దాడిలో 11 మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. అల్ జజీరా ప్రకారం, ఈ దాడి నేరుగా నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
నగరంలోని మూడు నివాస భవనాలపై క్షిపణులు పడటంతో గణనీయమైన నష్టం వాటిల్లిందని సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. మహల్లాత్‌తో పాటు, టెహ్రాన్, ఇస్ఫహాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.
8 బాలిస్టిక్ క్షిపణులను, 10 డ్రోన్‌లను కూల్చి వేసిన సౌదీ
రియాద్, తూర్పు ప్రావిన్స్ వైపు ప్రయోగించిన ఎనిమిది బాలిస్టిక్ క్షిపణులను, 10 డ్రోన్‌లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడులన్నింటినీ వాయు రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే కూల్చివేశాయి. క్షిపణులతో పాటు, గత కొన్ని గంటల్లో 10 డ్రోన్‌లను కూడా విజయవంతంగా అడ్డుకున్నట్లు సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరిగినట్లు ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
హోర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా రాజీ?
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోకపోయినా, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ట్రంప్, ఆయన సలహాదారులు ఈ వ్యూహాన్ని పునఃపరిశీలించారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది.
దీని ప్రకారం, హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం యుద్ధాన్ని పొడిగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల, దానిని పూర్తిగా తెరవకుండానే యుద్ధాన్ని ముగించే మార్గాన్ని ఇప్పుడు అన్వేషిస్తోంది.
మొదట ఇరాన్ నౌకాదళ, క్షిపణి సామర్థ్యాలను బలహీనపరచడం వంటి సైనిక లక్ష్యాలను సాధించడం అమెరికా ప్రణాళిక. ఆ తర్వాత, దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా వాణిజ్యాన్ని పునఃప్రారంభించేలా ఇరాన్‌ను బలవంతం చేయడం. ఈ వ్యూహంలో భాగంగా, ఐరోపా, గల్ఫ్ దేశాలను ఉపయోగించుకుని ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అమెరికా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన భీకర దాడి అని భావిస్తున్నారు. అందుకే ఈ దాడి దృశ్యాలను ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నట్టు అనుమానిస్తున్నారు.