Hyundai i20 : నెక్స్ట్ Gen Hyundai i20 ఫస్ట్ లుక్ అదుర్స్.!
Hyundai i20 : హ్యుందాయ్ మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ 'i20' నెక్స్ట్ జనరేషన్ (ఫోర్త్ జనరేషన్) మోడల్‌ను బ్రెజిల్ మార్కెట్లో..
Hyundai-i20
Hyundai i20 : హ్యుందాయ్ మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ 'i20' నెక్స్ట్ జనరేషన్ (ఫోర్త్ జనరేషన్) మోడల్‌ను బ్రెజిల్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మోడల్ కంటే సరికొత్త డిజైన్ లాంగ్వేజ్, ఫ్యూచరిస్టిక్ లుక్ , అత్యాధునిక టెక్నాలజీ క్యాబిన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. బ్రెజిల్‌లో ప్రదర్శించిన ఈ కొత్త తరం హ్యుందాయ్ i20, రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 2027 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఫ్యూచరిస్టిక్ డిజైన్ , ల్యాంబోర్గిని స్టైల్ DRLs
కొత్త జనరేషన్ హ్యుందాయ్ i20 ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి చాలా అగ్రెసివ్ అండ్ స్పోర్టీ లుక్ ఇచ్చారు. దీని ముందు భాగంలో స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ , ల్యాంబోర్గిని కార్ల తరహాలో ఉండే వినూత్నమైన 'Y' షేప్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) అందించారు. ఈ రెండు డీఆర్‌ఎల్స్‌ను కలుపుతూ కారు ముందు భాగం అంతటా విస్తరించే ఒక సన్నని లైట్ బార్‌ను అమర్చారు. షార్ప్ లైన్స్‌తో ఉన్న బోనెట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ , రీడిజైన్ చేసిన బంపర్ కారుకు మరింత బోల్డ్ లుక్‌ను తీసుకొచ్చాయి. అత్యంత ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ల్యాండ్ కానున్న 'అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్' (ADAS) కోసం వీలుగా ముందు బంపర్‌లో సెన్సార్లను కూడా అమర్చారు.
కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, పాత మోడల్ కంటే చాలా క్లీన్ అండ్ స్ట్రీమ్‌లైన్డ్‌గా కనిపిస్తోంది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన 17-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. కారు కింది భాగంలో ఇచ్చిన బ్లాక్ బాడీ క్లాడింగ్ దీనికి ఒక క్రాస్ఓవర్ లుక్‌ను ఇస్తోంది. వెనుక వైపు కూడా ముందు భాగం తరహాలోనే కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్-ల్యాంప్స్, రీషేప్ చేసిన టెయిల్‌గేట్ , సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్స్‌తో కారు వెనుక లుక్ మునుపటి కంటే చాలా ప్రీమియంగా మారింది.
లగ్జరీ కార్ల తరహా టెక్నాలజీ క్యాబిన్
కారు ఇంటీరియర్ హ్యుందాయ్ ఊహించని రేంజ్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ చేసింది. డాష్‌బోర్డ్ మధ్యలో ఒక పెద్ద కర్వ్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను అమర్చారు. దీనిలో 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , ఏకంగా 12.3-ఇంచుల సైజు గల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఒకే ప్యానెల్‌లా జోడించారు. ప్రస్తుత కార్లలో ఉన్న స్టీరింగ్ వీల్ స్థానంలో ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన సరికొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వచ్చింది.
సెంటర్ కన్సోల్‌లో ఏసీ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్ల స్థానంలో టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చారు, అయితే ఫ్యాన్ స్పీడ్ మార్చుకోవడానికి మాత్రం ఒక రోటరీ డయల్‌ను అలాగే ఉంచారు. క్యాబిన్ మొత్తం డ్యూయల్-టోన్ థీమ్‌తో, సెమీ-లెదరెట్ సీట్లు , వాటిపై i20 బ్రాండింగ్‌తో చాలా లగ్జరీగా కనిపిస్తోంది. వెనుక సీట్లలో ప్రయాణించే వారి కోసం 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ ఆప్షన్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, అందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను అందించారు. ఈ కొత్త మోడల్ బూట్ స్పేస్ 346 లీటర్లుగా ఉంది, ఇది ప్రస్తుత భారతీయ మోడల్ కంటే చాలా ఎక్కువ. బ్రెజిల్ మోడల్‌లో సన్‌రూఫ్ ఫీచర్ కనిపించనప్పటికీ, ఇండియాకు వచ్చే టాప్ వేరియంట్లలో హ్యుందాయ్ ఖచ్చితంగా సన్‌రూఫ్ అందించే అవకాశం ఉంది.
పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్
బ్రెజిల్ మార్కెట్ కోసం హ్యుందాయ్ ఈ కారును 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను రెండు వేర్వేరు ఆప్షన్లలో అందిస్తోంది. అందులో నార్మల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 79bhp పవర్, 100Nm టాప్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం టర్బోచార్జ్డ్ డైరెక్ట్-ఇంజెక్షన్ వేరియంట్‌ను అందించారు. ఇది ఏకంగా 113bhp పవర్ , 172Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం 1,500 ఆర్‌పీఎమ్ నుంచే పీక్ టార్క్ అందుబాటులోకి రావడం వల్ల సిటీ రోడ్లపై నడపడానికి, అలాగే హైవేలపై ఓవర్‌టేక్ చేయడానికి ఈ కారు చాలా ఈజీగా ఉంటుంది.
ఇండియా మోడల్‌లో ఎలాంటి మార్పులు ఉండొచ్చు?
భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ ఇంజిన్ ఆప్షన్లలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్పోర్టీ ఎన్-లైన్ వేరియంట్ల కోసం 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లను అలాగే కొనసాగించే అవకాశం ఉంది. అయితే, భవిష్యత్ మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా హ్యుందాయ్ డెవలప్ చేస్తున్న సరికొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతర్జాతీయంగా ఈ కారు కంఫర్ట్, లిమిటెడ్, ఎక్స్ లైన్, ప్లాటినం , అల్టిమేట్ వంటి వేరియంట్లలో లభించనుంది. ఇండియా లాంచ్ సమయం దగ్గరపడే కొద్దీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్లోకి వస్తే ఇది మారుతి సుజుకి బెలేనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.