Traffic Challan : బండి రేటు రూ.లక్ష.. కానీ దానీ మీద చలాన్లు మాత్రం ఏకంగా రూ.2.29 లక్షలు
Traffic Challan : హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సాధారణ బైక్‌ను ఆపి చెక్ చేయగా.. దానిపై ఏకంగా రూ.2,29,000 విలువైన 93 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆ బండిని సీజ్ చేశారు.
Traffic Challan
Traffic Challan : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల కథలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఒక ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక మోటార్ సైకిల్‌ను ఆపి రికార్డులు చెక్ చేయగా.. ఆ బండిపై ఉన్న పెండింగ్ చలాన్ల లిస్ట్ చూసి పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ బైక్ ప్రస్తుత మార్కెట్ విలువ ఒక లక్ష రూపాయల కంటే తక్కువే ఉంటుంది. కానీ దానిపై ఉన్న జరిమానా మొత్తం మాత్రం ఆ బైక్ ఖరీదు కంటే రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెక్టార్ 4/7 చౌరస్తా వద్ద అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) మదన్ పాల్, కానిస్టేబుల్ రాబిన్, ఇతర సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక బైకర్ ను అనుమానంతో ఆపి, ఆ బండి నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్ ఇ-చలాన్ సిస్టమ్‌లో వెతికారు. ఆ స్క్రీన్‌పై వచ్చిన చలాన్ల సంఖ్యను చూసి అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం ఆ బైక్‌పై అప్పటికే ఏకంగా 93 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బైక్‌పై నమోదైన 93 చలాన్ల మొత్తం జరిమానా విలువ అక్షరాలా రూ.2,29,000గా ఉంది. ఆ బైక్‌పై ఉన్న చలాన్లలో ఎక్కువ భాగం హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే జీబ్రా క్రాసింగ్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్లే నమోదయ్యాయి. ఈ భారీ పెండింగ్ అమౌంట్ చూసిన పోలీసులు.. వెంటనే సదరు వాహనదారుడిని బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాల్సిందిగా కోరారు. అయితే అతని వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేకపోవడంతో, పోలీసులు ఆ మోటార్ సైకిల్‌ను అక్కడికక్కడే జప్తు చేసి, పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన సేఫ్ పార్కింగ్ యార్డ్‌కు తరలించారు.
ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు ఈ డ్రైవ్ గురించి మాట్లాడుతూ.. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఎవరైనా వాహనదారులు తమపై పడిన చలాన్లను 90 రోజులకు పైగా కట్టకుండా పెండింగ్‌లో ఉంచితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఇలాంటి లాంగ్ పెండింగ్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అలాగే వాహనదారులకు వారి పెండింగ్ చలాన్ల గురించి అవగాహన కల్పిస్తూ, వాటిని ఆన్‌లైన్ లేదా కోర్టుల ద్వారా సమయానికి చెల్లించేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీస్ ప్రతినిధి నగర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. వాహనదారులు అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, చలాన్లను సకాలంలో కట్టాలని కోరారు. దీనితో పాటు ప్రతి వాహనానికి తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన హెచ్ఎస్ఆర్‌పీ నెంబర్ ప్లేట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ హై సెక్యూరిటీ ప్లేట్లు లేని వాహనాలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ తరహా ప్లేట్లు ఉండటం వల్ల సమాజంలో జరిగే నేరాలు, దొంగతనాలు, అనుమానాస్పద శక్తులను పోలీసులు సులభంగా గుర్తించడానికి వీలుంటుందని ఆయన వెల్లడించారు.