Ethanol Fuel : మారుతి నుంచి టాటా వరకు.. ఇథనాల్ ఇంధనంతో ఏ కంపెనీలకు భారీ లాభం?
Ethanol Fuel : భారత్‌లో పెట్రోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం E20 ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో మారుతి, టాటా, టయోటా, హ్యుందాయ్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లను సిద్ధం చేస్తున్నాయి.
Ethanol Fuel
Ethanol Fuel : భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి సామాన్యుడికి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. విదేశీ ముడి చమురుపై మన దేశ ఆధారపడటాన్ని తగ్గించడానికి, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తోంది. ఈ E20 అంటే మనం వాడే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (చెరకు, మొక్కజొన్న వంటి పంటల వ్యర్థాల నుంచి తీసేది), 80 శాతం సాధారణ పెట్రోల్ కలుపుతారు. ఈ సరికొత్త మార్పును అందిపుచ్చుకోవడానికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు తమ కార్ల ఇంజన్లను సరికొత్త టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.
ముందే అడుగు వేసిన టయోటా.. 100 శాతం ఇథనాల్ కార్లు
ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ రేసులో జపాన్ కార్ల దిగ్గజం టయోటా అందరికంటే ముందే ఒక అడుగు ముందుకు వేసింది. కంపెనీ మొదట తన పాపులర్ కొరోల్లా హైబ్రిడ్ కారు ఇథనాల్ వెర్షన్‌ను ప్రదర్శించింది, ఇది ఏకంగా E100 అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో కూడా నడవగలదు. ఆ తర్వాత మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. దీని కోసం కారు ఇంజన్, ఫ్యూయల్ సప్లై సిస్టమ్‌ను ఇథనాల్ ఇంధనానికి తగినట్లుగా పూర్తిగా రీ-డిజైన్ చేశారు.
సామాన్యుడి కోసం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ కూడా ఈ గ్రీన్ ఇంధన మార్పును చాలా సీరియస్‌గా తీసుకుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేసింది. భారతదేశంలోనే మాస్ ప్రొడక్షన్ లెవెల్లో వస్తున్న మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ఇదే కావడం విశేషం. ఈ కారును E85 నుంచి E100 ఇంధనంతో కూడా నడిపేలా ప్రత్యేక సెన్సార్లు, సరికొత్త ఫ్యూయల్ లైన్స్ మరియు అప్‌డేటెడ్ ఇంజన్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.
పోటీలో దూసుకుపోతున్న హ్యుందాయ్, టాటా మోటార్స్
మరోవైపు సౌత్ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ కూడా తమ కార్లను ఇథనాల్ ఫ్రెండ్లీగా మారుస్తోంది. భారతీయులు ఎంతగానో ఇష్టపడే క్రెటా ఎస్‌యూవీని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో కంపెనీ సిద్ధం చేసింది. దీని టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఇథనాల్‌తో నడిచేలా ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. అదేవిధంగా స్వదేశీ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఈ రేసులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టాటా కంపెనీకి చెందిన మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను సిద్ధం చేశారు. ఈ కారు ఇంజన్, ఈసీయూ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయడం ద్వారా ఇది E85 ఇంధన మిశ్రమాన్ని కూడా చాలా సులభంగా తట్టుకోగలదు.
రైతులకు లాభం.. దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్
ఈ ఇథనాల్ ఇంధనం వల్ల కేవలం వాహనదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతులకు భారీగా లాభం చేకూరనుంది. మన దేశంలో పండే చెరకు, ఇతర ధాన్యాల వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో మార్కెట్లో E20 కార్ల డిమాండ్ విపరీతంగా పెరగబోతోంది. అందుకే ఇప్పుడు కొత్త పెట్రోల్ కారు కొనేవారు సదరు మోడల్ E20 లేదా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.