Hyundai: కారులోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఎస్‌యూవీ

Hyundai: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది.

Update: 2026-08-28 02:18 GMT

Hyundai Palisade

Hyundai: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది.అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో పాలిసేడ్ హై రూఫ్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రోల్స్ రాయిస్ కార్లలో ఉండే విధంగా పెద్ద సన్ రూఫ్, 21.4 అంగుళాల పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు వాహన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. హ్యుందాయ్ గ్లోబల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన పాలిసేడ్ ఎస్‌యూవీని మరింత లగ్జరీగా తీర్చిదిద్దింది. ఈ కొత్త హై రూఫ్ వెర్షన్‌లో కారు పైకప్పును సాధారణ మోడల్ కంటే 240 మిమీ మేర పెంచడంతో మొత్తం ఎత్తు 2,005 మిమీకి చేరింది. రాయల్ లుక్ ఇచ్చేందుకు రోల్స్ రాయిస్ మోడల్స్‌ నుంచి స్ఫూర్తి పొంది స్టారీ స్కై హెడ్‌లైనర్ డిజైన్ చేశారు. రాత్రి వేళల్లో వాహనం లోపల కూర్చుంటే ఆకాశంలో నక్షత్రాల మధ్య ఉన్నామనే భావన కలిగేలా చిన్నచిన్న లైటింగ్ చుక్కలను కప్పు పైభాగంలో అమర్చడం విశేషం.

కార్లోనే థియేటర్ అనుభూతి

ప్రయాణికుల సౌకర్యార్థం వాహనం లోపల అడ్వాన్సుడ్ టెక్నాలజీని జోడించారు. వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం 21.4 అంగుళాల ఫోల్డ్-డౌన్ స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ పెద్ద స్క్రీన్ సహాయంతో ప్రయాణంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, యూట్యూబ్ వంటి యాప్స్ ద్వారా సినిమాలు, వీడియోలను తిలకించవచ్చు. దీనికి తోడు నాలుగు ఏసీ వెంట్లు, పాప్-అప్ ఎల్ఈడీ రీడింగ్ లైట్లు, స్వతంత్ర క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ప్రయాణాన్ని మరింత సుఖమయంగా మారుస్తాయి. కొనుగోలుదారులు తమ అవసరాలకు తగినట్లు 7-సీటర్ లేదా 9-సీటర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

దూకుడు ప్రదర్శించే పవర్‌ఫుల్ ఇంజిన్ పర్ఫామెన్స్

పవర్, పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఎస్‌యూవీ ఏమాత్రం తగ్గలేదు. ఐసీఈ మోడల్‌లో 2.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 277 హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎమ్ టాపింగ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కార్‌లో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పర్యావరణ స్పృహ కలిగిన వారి కోసం హ్యాబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చారు. 2.5-లీటర్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేసి తయారు చేసిన ఈ మోడల్ మొత్తం 329 హెచ్‌పీ పవర్‌ను విడుదల చేస్తూ అత్యంత శక్తివంతమైన పనితీరును కనబరుస్తుంది.

భారత్‌లోకి ఎప్పుడు రానుంది?

గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రారంభ ధర ఐసీఈ వేరియంట్‌లో కొరియన్ కరెన్సీ ప్రకారం కేఆర్‌డబ్ల్యూ 72.44 మిలియన్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.49.83 లక్షలు) నుంచి ప్రారంభమవుతోంది. హ్యాబ్రిడ్ వేరియంట్ గరిష్ట ధర కేఆర్‌డబ్ల్యూ 83.99 మిలియన్లు (సుమారు రూ. 57.78 లక్షలు) వరకు ఉంది. ఈ పాలిసేడ్ ఎస్‌యూవీని 2028 నాటికి భారతీయ రోడ్లపైకి తీసుకురావడానికి హ్యుందాయ్ ప్రణాళికలు రచిస్తోంది. మన దేశ వాతావరణం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 7-సీటర్ హ్యాబ్రిడ్ మోడల్ మాత్రమే ఇక్కడ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News