Kia Sorento: లగ్జరీ కేబిన్, లెవెల్-2 ADAS సేఫ్టీ.. మార్కెట్లోకి వస్తున్న కియా 7 సీటర్ ఎస్‌యూవీ
Kia Sorento: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో టెస్టింగ్ జరుపుకుంటున్న సమయంలో ఈ ప్రీమియం 7 సీటర్ కారు పూర్తిస్థాయిలో కెమెరాకు చిక్కింది.
Kia Sorento
Kia Sorento: ఆటోమొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కియా సొరెంటో ఎస్‌యూవీ భారత రహదారులపై ముసుగు లేకుండా ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో టెస్టింగ్ జరుపుకుంటున్న సమయంలో ఈ ప్రీమియం 7 సీటర్ కారు పూర్తిస్థాయిలో కెమెరాకు చిక్కింది. రాబోయే సెప్టెంబర్ 4వ తేదీన అధికారికంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ ఎస్‌యూవీ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. కెమెరాకు చిక్కిన కియా సొరెంటో మ్యాట్ గ్రే రంగులో అత్యంత ప్రీమియం, స్పోర్టీ లుక్‌తో దర్శనమిచ్చింది. ఈ కారు ముందు భాగంలో కియా స్టాండర్డ్ టైగర్ నోస్ గ్రిల్ తో పాటు అల్యూమినియం ఫినిషింగ్ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కొత్త వర్టికల్ షేప్ స్టార్ మ్యాప్ LED DRLలు, నిలువుగా ఉండే హెడ్‌లైట్లు కారుకు పూర్తి అగ్రెసివ్ స్టైల్‌ను అందించాయి. సైడ్ ప్రొఫైల్ పరిశీలిస్తే 19-అంగుళాల డ్యూయల్-టోన్ మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, స్ట్రాంగ్ బంపర్లతో వర్టికల్ LED టెయిల్ ల్యాంప్స్ కారుకు బాక్సీ రూపాన్ని తెచ్చిపెట్టాయి.
అత్యంత లగ్జరీ ఇంటీరియర్ కేబిన్
కారు ఇంటీరియర్ కేబిన్ నలుపు, బేజ్ కలర్ కాంబినేషన్ థీమ్‌లో రాయల్ లుక్‌ను సంతరించుకుంది. డాష్‌బోర్డ్ పై భాగంలో 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అమర్చారు. వీటితో పాటు 12-స్పీకర్ల బోస్ ప్రసిద్ధ సౌండ్ సిస్టమ్, 64-రంగుల యాంబియంట్ లైటింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గాలిని అందించే వెంటిలేటెడ్ సీట్లు, పొజిషన్ గుర్తుంచుకునే మెమరీ ఫంక్షన్ సీట్ అడ్జస్ట్‌మెంట్, రోటరీ నాబ్స్ ఈ కారులో ప్రత్యేకంగా నిలుస్తాయి.
పవర్ ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే కియా సొరెంటో రెండు విభాగాల్లో అందుబాటులోకి రానుంది. మొదటిది 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ కాగా, ఇది 238bhp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత్‌లో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సాంకేతికతతో రాబోతున్న తొలి హైబ్రిడ్ ఎస్‌యూవీగా ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. రెండో ఆప్షన్‌గా 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇది 2022bhp పవర్, 440Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు వర్షన్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది.
లెవెల్-2 ADAS సేఫ్టీ.. గట్టి పోటీ
రక్షణ విషయానికి వస్తే కియా ఈ కారులో ఎలాంటి రాజీ పడలేదు. 7 సీటర్ కేటగిరీలో వస్తున్న ఈ ఎస్‌యూవీలో లెవెల్-2 ADASతో పాటు మెరుగైన భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. భారత మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఇది నేరుగా టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా XUV 7XO, స్కోడా కోడియాక్, ఫోక్స్‌వాగన్ తైరోన్ వంటి అగ్రశ్రేణి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. సరసమైన ధరలోనే దీనిని విడుదల చేస్తే భారత్‌లో ఫార్చ్యూనర్ ఆధిపత్యానికి బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, మైండ్ బ్లాకింగ్ ఫీచర్లతో వస్తున్న కియా సొరెంటో భారత ప్రీమియం ఎస్‌యూవీ రంగాన్ని ఊపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 4న కానున్న అధికారిక ప్రకటన కోసం ఆటోమొబైల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.