Tesla: టెస్లా కారెక్కితే ప్రాణాలకే ప్రమాదమా? ఏకంగా 30 లక్షల ఈవీల రీకాల్.. కార్ల ఓనర్లలో దడ!

Tesla: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లలో ఊహించని సాంకేతిక లోపం వెలుగు చూసింది.

Update: 2026-08-23 05:15 GMT

Tesla

Tesla: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లలో ఊహించని సాంకేతిక లోపం వెలుగు చూసింది. కార్ల డోర్ హ్యాండిల్స్ వల్ల ప్రమాద సమయాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చైనా మార్కెట్ రెగ్యులేటర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టెస్లాతో పాటు ప్రముఖ చైనీస్ ఈవీ బ్రాండ్లకు చెందిన దాదాపు 40 లక్షలకు పైగా కార్లను వెనక్కి పిలిపిస్తున్నారు. చైనా మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, టెస్లా కంపెనీ ఒక్క చైనాలోనే నిర్మించినవి, దిగుమతి చేసుకున్నవి కలిపి దాదాపు 29.8 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తోంది. మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సిరీస్ కార్లు ఈ జాబితాలో ఉన్నాయి. కారు బాడీతో పాటు సమానంగా కలిసిపోయే 'హిడెన్ డోర్ హ్యాండిల్స్' (పాప్ అప్ డోర్ హ్యాండిల్స్) వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని అధికారిక సమీక్షలో తేలింది.

ప్రమాద సమయాల్లో తెరుచుకోని తలుపులు

ఆధునిక లుక్ కోసం ఈవీ కంపెనీలు కారు బాడీలో కలిసిపోయే ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కారులోని విద్యుత్ సరఫరా లేదా బ్యాటరీ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందితే, ఈ ఎలక్ట్రానిక్ తలుపులు తెరుచుకోవు. లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేక, బయట ఉన్న రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లలేక కారులోనే ప్రాణాలు వదిలే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ భద్రతా సమస్యల వల్లే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మిగతా ఈవీ కంపెనీలకూ షాక్

ఈ లోపం ఒక్క టెస్లాకే పరిమితం కాలేదు. ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) కూడా తమ 3.9 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. లీప్‌మోటార్ 3.7 లక్షల వాహనాలను, గీలీ, ఎక్స్‌పెంగ్ కంపెనీలు తమ కార్లను వెనక్కి పిలిపిస్తున్నాయి. కారు అందం కంటే ప్రయాణికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన చైనా, వచ్చే ఏడాది నుంచి ఇలాంటి హిడెన్ హ్యాండిల్ డిజైన్లపై పూర్తిగా నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో సరిదిద్దే యత్నం

ఈ భద్రతా సమస్యను పరిష్కరించడానికి టెస్లా ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విడుదల చేస్తోంది. సాఫ్ట్‌వేర్ మార్పుల ద్వారా ఎమర్జెన్సీ సమయంలో తలుపులు సులభంగా తెరుచుకునేలా డోర్ హ్యాండిల్ లాకింగ్ సిస్టమ్‌ను మార్చనున్నారు. సాఫ్ట్‌వేర్ ద్వారా సమస్య పరిష్కారం కాని వాహనాలకు నేరుగా విడిభాగాలను మార్చి సరిచేస్తామని కంపెనీలు ప్రకటించాయి. ఆధునిక ఎలక్ట్రిక్ కార్లలో అట్రాక్టివ్ లుక్, అధునాతన ఫీచర్లు ఎంత ముఖ్యమో, ప్రయాణికుల రక్షణ కూడా అంతే ముఖ్యం. కార్ తయారీ కంపెనీలు కేవలం డిజైన్‌పైనే కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే ప్రాథమిక భద్రతా ఫీచర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News