Mahindra: కెప్టెన్ సీట్లు, 540 డిగ్రీల కెమెరాతో మహీంద్రా కొత్త వేరియంట్..ఇది లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ గురూ
Mahindra: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ 9ఎస్‌లో సరికొత్త 6-సీటర్ కాన్ఫిగరేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Mahindra XEV 9S
Mahindra: మహీంద్రా సంస్థ భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు 7-సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా సంచలనం సృష్టించిన ఎక్స్‌ఈవీ 9ఎస్ మోడల్‌లో ఇప్పుడు 6-సీటర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్‌లో రెండో వరుస సాధారణ బెంచ్ సీట్లకు బదులుగా ప్రత్యేకమైన కెప్టెన్ సీట్లను అందించారు. ఈ సీట్లకు విడివిడిగా ఆర్మ్‌రెస్ట్‌లు ఉండటంతో పాటు మూడో వరుసలోకి వెళ్లడానికి మధ్యలో సులభమైన దారి ఉంటుంది. డ్రైవర్లను పెట్టుకుని ప్రయాణించే వ్యాపారవేత్తలు, కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించాలనుకునే వారికి ఈ సీటింగ్ తీవ్ర అనుకూలంగా ఉంటుంది.
హైయర్ వేరియంట్లలోనే లభ్యం
ఈ కొత్త కెప్టెన్ సీట్ల ఆప్షన్ ఎంట్రీ లెవెల్ మోడల్‌లో కాకుండా కేవలం ప్రైమ్ వేరియంట్లయిన ప్యాక్ టూ అబోవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబోవ్ వర్షన్లలో మాత్రమే లభిస్తుంది. నవంబర్ 2025లో రూ.19.95 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ కారు, మహీంద్రా ఈవీ పోర్ట్‌ఫోలియోలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. గత నెలలోనే ఏకంగా 4,131 యూనిట్లు అమ్ముడుపోవడం దీనికున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త 2+2+2 సీటింగ్ లేఅవుట్ వల్ల దీని అమ్మకాలు మరింత పుంజుకుంటాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అద్భుతమైన ఫీచర్లు, సాంకేతికత
ఫీచర్ల విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. డ్యాష్‌బోర్డ్‌పై మూడు 12.3-ఇంచుల భారీ స్క్రీన్‌లు, ముందు వెనుక వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ ప్రయాణికులకు మైమరిపించే అనుభూతిని ఇస్తాయి. వీటితో పాటు 5జీ కనెక్టివిటీ, 540-డిగ్రీ కెమెరా, డిజిటల్ కీ ఫంక్షనాలిటీ, విజన్ ఎక్స్ ఏఆర్ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఆధునిక హంగులు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం లెవెల్ 2+ అడాస్ సాంకేతికత, 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రమాణికంగా అమర్చారు.
బ్యాటరీ సామర్థ్యం, పవర్ ఆప్షన్లు
ఈ మోడల్ మెకానికల్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మహీంద్రా స్వదేశీ ఇంగ్లో ఈవీ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. కొనుగోలుదారులు తమ అవసరాన్ని బట్టి 59 కిలోవాట్, 70 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సింగిల్ ఛార్జ్‌పై వేరియంట్‌ను బట్టి 521 కిలోమీటర్ల నుంచి ఏకంగా 679 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. వెనుక చక్రాలకు పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ 282 బిహెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు, 180 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.