Mahindra Thar: 18 ఇంచుల అలాయ్ వీల్స్, డిజిటల్ స్పాట్.. మైండ్ బ్లోయింగ్ లుక్‌లో నయా థార్
Mahindra Thar: ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా 3-డోర్ థార్ సరికొత్త అవతారంలో రాబోతోంది.
Mahindra Thar: ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా 3-డోర్ థార్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ఆకర్షణీయమైన ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ మోడళ్లు రోడ్లపై కనిపించడంతో కార్ల ప్రియుల చూపు దీనివైపు మళ్లింది. రాబోయే దివాలి నాటికి ఈ కారు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రహదారులపై టెస్టింగ్ జరుపుకుంటూ కనిపించిన రెండు థార్ మోడళ్లు ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించాయి. వాహనం ముందూ వెనుక భాగాలను కవర్ చేసినప్పటికీ ప్రధాన మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇటీవల సంచలనం సృష్టించిన మహీంద్రా థార్ రాక్స్ శైలిలోనే దీని ఫ్రంట్ డిజైన్ ఉండనుంది. ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్‌తో కూడిన రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, నాలుగు స్లాట్లతో కూడిన విశాలమైన గ్రిల్, కొత్తగా రూపొందించిన బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫ్రంట్ బంపర్‌లో పార్కింగ్ సెన్సార్లు కూడా అమర్చినట్లు తెలుస్తోంది.
ప్రీమియం 18-ఇంచ్ అలాయ్ వీల్స్
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే పాత మోడల్ మజిక్యులర్ రూపాన్ని అలాగే ఉంచుతూ చిన్నచిన్న మార్పులు చేశారు. చంకీ బాడీ క్లాడింగ్, నల్లటి గ్రాబ్ హ్యాండిల్స్ యథాతథంగా కొనసాగుతున్నాయి. 10-స్పోక్ 18-ఇంచ్ అలాయ్ వీల్స్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ని తీసుకొచ్చాయి. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అప్‌డేటెడ్ బంపర్ చేర్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వెనుక బంపర్‌లో భాగం కానున్నాయి.
కేబిన్‌లో భారీ డిజిటల్ అప్‌గ్రేడ్స్
కారు లోపలి భాగంలో లేఅవుట్ పాతదానిలా ఉన్నప్పటికీ సాంకేతిక సదుపాయాల్లో భారీ మార్పులు జరిగాయి. థార్ రాక్స్ మోడల్ లో చూసినట్లుగానే 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో రానున్నాయి. వీటి ద్వారా నేవిగేషన్, ఆఫ్-రోడ్ డేటా, డ్రైవింగ్ సమాచారం, మైలేజ్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్లు, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్‌తో పాటు సేఫ్టీ కోసం లెవెల్-2 అడాస్ టెక్నాలజీని అందించే అవకాశం ఉంది. దీనివల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ఇంజిన్ సామర్థ్యంలో మార్పులు లేవు
సాంకేతిక ఆధారిత ఫీచర్లు పెరిగినప్పటికీ ఇంజిన్ పరంగా పాత సామర్థ్యాన్నే కొనసాగించనున్నారు. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డిజైన్, 2.2-లీటర్ డిజైన్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉంటాయి. రియర్-వీల్ డ్రైవ్‌తో పాటు అవసరమైన వేరియంట్లలో 4x4 సిస్టమ్ యథాతథంగా లభిస్తుంది. రూపురేఖలు, అత్యాధునిక ఫీచర్లతో రాబోతున్న ఈ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్ ఆఫ్-రోడ్ వాహన ప్రియులను కచ్చితంగా అలరిస్తుంది. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈ కారు ధరలు, లాంచ్ వివరాలపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.