Renault: ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేసేందుకు రెనాల్ట్ బిగ్ ప్లాన్.. 2027 నాటికి 4 కొత్త కార్లు లాంచ్

Renault: భారత కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-08-27 02:36 GMT

Renault

Renault: భారత కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి ఏకంగా నాలుగు సరికొత్త మోడళ్లను రోడ్లపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ విభాగాల్లో ఈ మోడళ్లను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ఫ్యూచర్‌రెడీ గ్లోబల్ వ్యూహంలో భాగంగా భారత మార్కెట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మన దేశం కోసం 7 కొత్త మోడళ్లు, రెండు సరికొత్త ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తేవడం కంపెనీ లక్ష్యం. న్యూ-జెనరేషన్ డస్టర్ లాంచ్‌తో ఇప్పటికే సంచలనం సృష్టించిన కంపెనీ, రాబోయే మూడేళ్లలో మరో నాలుగు అత్యాధునిక మోడళ్లను భారత రోడ్లపైకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకుంది.

దివాళి డస్టర్ హైబ్రిడ్ విప్లవం

కార్ల ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డస్టర్ హైబ్రిడ్ మోడల్ 2026 దివాళి నాటికి మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. ఈ కారులో 1.8-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీని అందించనున్నారు. ఈ వ్యవస్థ 160 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ-టెక్ పేరుతో పిలిచే ఈ హైబ్రిడ్ సాంకేతికతలో తమ ఫార్ములా 1 రేసింగ్ అనుభవాన్ని ఉపయోగించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కుటుంబాల కోసం 7-సీటర్ డస్టర్, సరికొత్త బ్రిడ్జర్

5-సీటర్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పైనే 7-సీటర్ వెర్షన్‌ను కూడా రూపొందిస్తున్నారు. పెద్ద కుటుంబాల అవసరాలకు తగినట్లుగా మూడో వరుస సీటింగ్ కోసం ఈ కారు పొడవును పెంచనున్నారు. దీంతో పాటు 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే బ్రిడ్జర్ అనే సబ్-కాంప్యాక్ట్ ఎస్‌యూవీపై కూడా పనిచేస్తున్నారు. ఆర్‌-జిఎమ్‌పి ప్లాట్‌ఫారమ్‌పై రూపొందే ఈ బ్రిడ్జర్ ఎస్‌యూవీ పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. దీని బాక్సీ డిజైన్, ఎత్తైన రూపురేఖలు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

కొత్త లుక్‌లో రాబోతున్న క్విడ్ ఫేస్ లిఫ్ట్

రెనాల్ట్కు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కొత్త అవతారంలోకి మారనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారును 2027 చివరినాటికి లాంచ్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. క్విడ్ ఈ-టెక్ ఆధారంగా ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, సరికొత్త హెడ్‌లాంప్‌లతో దీన్ని డిజైన్ చేస్తున్నారు. కేబిన్ లోపల డిజిటల్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. హ్యాచ్‌బ్యాక్ నుంచి లగ్జరీ ఎస్‌యూవీల వరకు, పెట్రోల్ నుంచి హైబ్రిడ్ వరకు ప్రతి కేటగిరీలోనూ కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా భారత మార్కెట్లో మళ్లీ పూర్వవైభవం సాధించాలని రెనాల్ట్ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కార్లు మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.

Tags:    

Similar News