Hyundai: హ్యుందాయ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. మరింత పెద్దగా, కొత్త లుక్‌లో రాబోతున్న గ్రాండ్ i10 నియాస్
Hyundai: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించేందుకు హ్యుందాయ్ సంస్థ దిమ్మతిరిగే మాస్టర్ ప్లాన్ వేసింది.
Hyundai Grand i10 Nios
Hyundai: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించేందుకు హ్యుందాయ్ సంస్థ దిమ్మతిరిగే మాస్టర్ ప్లాన్ వేసింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ i10 నియాస్ను మరింత పెద్దగా, ప్రీమియంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎన్‌జీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో రాబోతున్న ఈ కారు వివరాలు ఇప్పుడు కార్ లవర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన హ్యుందాయ్, 2030 నాటికి దేశంలో దాదాపు 30కి పైగా కొత్త ఉత్పత్తులు, అప్‌డేటెడ్ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 సీఈఓ ఇన్వెస్టర్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విస్తరణ వ్యూహంలో భాగంగానే నయా జనరేషన్ గ్రాండ్ i10 నియాస్ రూపుదిద్దుకుంటోంది.
మునుపటి కంటే పెద్దదిగా
సాంకేతిక వివరాలను కంపెనీ అధికారికంగా రహస్యంగా ఉంచినప్పటికీ, కొత్త మోడల్ పరిమాణం ప్రస్తుత వెర్షన్ కంటే చాలా పెద్దదిగా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. పొడవు దాదాపు 3.95 మీటర్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఇది ప్రస్తుత హ్యుందాయ్ i20 సైజుకు చేరువవుతుంది. లగేజీ స్పేస్, కేబిన్ స్థలం ఎక్కువగా కోరుకునే భారతీయ వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా దీనిని మరింత విశాలంగా డిజైన్ చేస్తున్నారు.
ఎక్స్‌టర్ తరహా ఆధునిక ఫీచర్లు
పెరిగిన సైజుకు తగ్గట్లే ఈ కారులో ఫీచర్ల లోటు లేకుండా చూస్తోంది. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న ఎక్స్‌టర్ కారులో ఉన్న అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఈ కొత్త గ్రాండ్ i10 నియాస్‌లో చేర్చనున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు సీఎన్‌జీ-ఎఎమ్‌టీ పవర్‌ట్రెయిన్ ఎంపిక. సీఎన్‌జీ ఇంధనంతో ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌలభ్యం కోరుకునే ప్రయాణికులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. రన్నింగ్ కాస్ట్ తగ్గడంతో పాటు నగరాల్లో ప్రయాణం మరింత సులభతరం కానుంది.
కొత్త ఆరా మోడల్ లాంచ్
గ్రాండ్ i10 నియాస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే నెక్స్ట్ జనరేషన్ ఆరా కాంపాక్ట్ సెడాన్‌ను కూడా తీసుకురానున్నారు. వ్యాపార, వ్యక్తిగత విభాగాల్లో ఆరా సీఎన్‌జీ వేరియంట్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశాన్ని ఒక గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా మార్చి, ఇక్కడి నుంచి వివిధ దేశాలకు ఈ కొత్త కార్లను ఎగుమతి చేసేందుకు హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది.