Vizag: పేదరిక నిర్మూలనలో విశాఖ పీ-4 విజయగాథ 66 వేల కుటుంబాల దత్తత

Vizag: విశాఖపట్నం జిల్లాలో పీ-4 కార్యక్రమం విజయగాథ. 7,539 మంది సామాజిక కార్యకర్తలు, 66,103 కుటుంబాల దత్తత.

Update: 2026-04-10 09:48 GMT

Vizag: పేదరిక నిర్మూలనలో విశాఖ పీ-4 విజయగాథ 66 వేల కుటుంబాల దత్తత

Vizag: విశాఖపట్నం పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విజ‌య‌గాథ‌గా నిలుస్తోంది. అంద‌రిలో స్ఫూర్తిని నింపుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అమలు అవుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రతీకగా మారింది. జిల్లా అధికారుల సమన్వయం, దాతల దాతృత్వం కలిసి విశాఖను సామాజిక సేవలో ముందంజలో నిలిపాయి. ముఖ్య‌మంత్రి పిలుపునందుకొని పీ-4లో 7,539 చేరిన స‌మాజ సేవ‌కులు.. 66,103 కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకున్నాయి. జిల్లాకు చెందిన‌ ప‌లు సంస్థ‌లు, వ్య‌క్తులు వివిధ రూపాల్లో రూ.20.86 కోట్ల సాయ‌మందించి పీ-4 కార్య‌క్ర‌మ స్ఫూర్తిని న‌లుమూల‌లా ఇనుమ‌డింపజేశాయి.

ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన పీ-4 వార్షిక‌ మ‌హోత్స‌వంలో అత్యంత సేవాస్ఫూర్తిని కొన‌సాగించిన 20 మంది దాత‌లకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, భీమిలి ఎమ్మెల్యే, జిల్లా క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా అభినంద‌న ప‌త్రాలు అందించ‌టంతో పాటు, స‌త్కారం చేశారు. ఇంత‌కీ వారంతా ఏం చేశారు.. స‌మాజానికి ఎలాంటి సాయ‌మందించారు.. పీ-4లో ఎలాంటి పాత్ర పోషించారో.. ఓ సారి తెలుసుకుందాం.

గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుంటూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ..

దివిస్ ఫౌండేషన్, హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్, లుపిన్ ఫౌండేషన్, స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ వంటి సంస్థలు సమాజ సేవలో విశేష పాత్ర పోషించగా, ఎన్‌టీపీసీ, ఐఓసిఎల్, కోరమాండల్ ఇంటర్నేషనల్, నాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ గంగవరం పోర్ట్ వంటి సంస్థలు ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా సహకరించాయి. దివిస్ ఫౌండేషన్ భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో చిప్పాడ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకొని ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత రంగాల్లో విశేష కార్యక్రమాలు కొన‌సాగిస్తోంది. దీని కోసం రూ.7 కోట్ల‌ను వ్య‌యం చేసింది.

హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ సంస్థ గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో 15 అంగ‌న్వాడీ కేంద్రాల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం చ‌ర్య‌లు తీసుకుంది. లుపిన్ ఫౌండేషన్ అగ‌నంపూడి ఆసుప‌త్రిలో మౌలిక స‌దుపాయాల కోసం రూ.18 ల‌క్ష‌లు అందించింది. స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఏటా రూ.15.7 ల‌క్ష‌లు వెచ్చిస్తూ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్, ఆరోగ్య అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించటంలో ప్ర‌ధాన భూమిక పోషిస్తోంది.

ఎన్‌టీపీసీ సంస్థ కింగ్ జార్జ్ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 5 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించగా, ఐఓసిఎల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు రూ. 97.5 లక్షల సహాయం అందించింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆరోగ్యం, విద్యాభివృద్ధికి రూ. 3.6 కోట్ల వ్యయం చేసింది. నాల్కో సంస్థ క్షయవ్యాధి రోగులకు రూ.6.83 ల‌క్ష‌ల‌తో పోషకాహార కిట్లు అందించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ‌క్క‌న్న‌పాలెం వ‌ద్ద ఐటీ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కోసం రూ.13.83 ల‌క్ష‌లు స‌మ‌కూర్చింది. అదానీ గంగవరం పోర్ట్ సంస్థ క‌లెక్ట‌రేట్ భవన మ‌రమ్మత్తులకు రూ.50 లక్షలు సాయం రూపంలో ఖర్చు చేసింది.

భీమిలి నియోజకవర్గంలో ధాన్ ఫౌండేషన్ & యంగ్ ఇండియా, శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్, మాజిక్ బస్ వంటి సంస్థలు విద్య, స్వచ్ఛత, యువత అభివృద్ధికి విశేష సేవలు అందించాయి. ముఖ్యంగా మాజిక్ బస్ సంస్థ 1700 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, 927 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రశంసనీయం. విస్కో సంస్థ బీసీ స్ట‌డీ స‌ర్కిల్ మ‌ర‌మ్మ‌తుల కోసం రూ.10.50 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం అందించింది. పోర్టు, వేదాంత గ్రూప్ సంస్థ‌లు త‌మ‌దైన రీతిలో పేద‌రిక నిర్మూల‌ను వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి.

వీటితో పాటు ప‌లు దాత‌లు వివిధ రూపాల్లో పేద‌రిక నిర్మూల‌న‌కు త‌మ‌వంతు సాయమందించారు. కందుల‌నాగరాజు కె.ఎన్.ఆర్. ఫౌండేష‌న్ ద్వారా ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌ల సంక్షేమం కొర‌కు రూ.6.60 లక్ష‌లు వెచ్చించారు. పీకే జోష్ అనే వ్య‌క్తి పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. జ‌గ‌న్మోహ‌న్ అనే దాత భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కోసం రూ.5లక్ష‌లు అందించారు. సూరిశెట్టి కిర‌ణ్ కుమార్ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో సంక్షేమాన్ని ప్రోత్స‌హించ‌డానికి రూ.15.7 ల‌క్ష‌లు సాయం చేశారు.

ఇంతమంది మార్గ‌ద‌ర్శ‌కులు ముందుకు రావ‌టం గ‌ర్వ‌కార‌ణం డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్ర‌భుత్వ విధానాలు, ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌, ఆశ‌యాల‌కు అనుగుణంగా పీ-4 కార్య‌క్ర‌మంలో ఏడువేలు పైచిలుకు మంది చేర‌టం గ‌ర్వ‌కారణం. విశాఖ జిల్లాలో 1.5 ల‌క్ష‌ల బంగారు కుటుంబాల‌ను గుర్తించాం. వాటిలో 66,103 కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకోవడం అభినంద‌నీయం. 7,539 మంది మార్గదర్శకులు సమాజ సేవలో నిబద్ధతతో పనిచేస్తుండటం ప్రశంసనీయం.

ఇంకా మిగిలిన కుటుంబాల దత్తత కోసం మరింత మంది మార్గదర్శకులు ముందుకు వ‌స్తే.. శ‌త‌శాతం ఫలితాల‌ను సాధించ‌గ‌లుగుతాం. ప్రభుత్వం చూపిన మార్గదర్శకత్వం, జిల్లా అధికారుల చొరవ, దాతల ఉదారత కలిసివచ్చినప్పుడు సమాజంలో సార్థక మార్పులు సాధ్యమవుతాయని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. జారీ, జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి, విశాఖ‌ప‌ట్ట‌ణం.

Tags:    

Similar News