Akividu: మతం మారినంత మాత్రాన.. ఆలయ చరిత్ర, పవిత్రత మారవు
Akividu: ఆకివీడు పెదపేటలో రామాలయ సందర్శనకు వెళ్లిన కూటమి కార్యకర్తలపై దాడిని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రంగా ఖండించారు.
Akividu: మతం మారినంత మాత్రాన.. ఆలయ చరిత్ర, పవిత్రత మారవు
Akividu: ఆకివీడు, మార్చి 28: ఆకివీడు పెదపేటలో పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన రామాలయ సందర్శనకు వెళ్లిన కూటమి కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. శనివారం ఆకివీడులోని బిజెపి మండల అధ్యక్షురాలు నాగమణి నివాసంలో కూటమి నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామనవమి నాడు ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రామాలయాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత కూటమి కార్యకర్తలపై భౌతిక దాడులు చేయటం తీవ్ర విచారకరమని ఈ సంఘటన ను సభ్య సమాజం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందన్నారు.
పెదపేట రామాలయం స్థలం ఏమాత్రం వివాదాస్పదం కాదని, అక్కడ ఎప్పటి నుంచో ఆలయం, రాముని విగ్రహాలు ఉన్నాయని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో కొందరు మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన అక్కడ పూర్వం నుంచి ఉన్న ఆలయ చరిత్ర, పవిత్రత, సంస్కృతి ఏమాత్రం మారవు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో హిందువులుగా ఉండి మత మార్పిడి చేసుకున్న వారు ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదని, మత మార్పిడి చేసుకున్న వారు ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించడానికి అనర్హులని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాను స్వయంగా రామాలయాన్ని సందర్శించాలని భావించినప్పటికీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు శాంతిభద్రతల దృష్ట్యా సహకరించాలని కోరడంతో ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వారి విజ్ఞప్తిని మన్నించి పర్యటన విరమించుకున్నట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. పెదపేటలో రామాలయం ఉన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారని, కేవలం మతం మారామనే సాకుతో పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదన్నారు. మతమార్పిడులకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే వారి మూలలు హిందూయిజంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కచ్చితంగా రామాలయాన్ని పునర్నిర్మిస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని శ్రీనివాస వర్మ తేల్చి చెప్పారు.
రాజకీయాలకు తావులేకుండా VHP ఆధ్వర్యంలో నిర్మాణం:
పెదపేట రామాలయ అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేదని, కేవలం స్థానిక హిందూ సమాజం విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, హిందూ జాతి జాగృతం కోసం పనిచేసే విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో స్థానిక ప్రముఖులు, ప్రజాసంఘాలతో కలిసి భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. దాడి చేసిన వర్గం నుండి కూడా కొందరు పెద్దలు తనకు ఫోన్ చేసి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారని, అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు, ఎవరి ప్రోత్సాహం ఉందనేది విచారణలో బయటపడుతుందని, తాను కూడా ఉన్నతాధికారుల నుండి నివేదిక తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా గ్రంధాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ, ఆకివీడు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ ముత్యాల రత్నం, టిడిపి నాయకులు మోటుపల్లి ప్రసాద్, కూటమికి కార్యకర్తలు పాల్గొన్నారు.