Bullet Train : ఏపీ రవాణా రంగంలో కొత్త శకం.. రాష్ట్రం మీదుగా మరో రెండు బుల్లెట్ రైలు కారిడార్లు

Bullet Train : ఏపీలో కొత్తగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అమరావతి నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు హైస్పీడ్ కనెక్టివిటీ రానుంది. చంద్రబాబు ప్రతిపాదనలతో రైల్వే శాఖ అలైన్‌మెంట్ సిద్ధం చేస్తోంది.

Update: 2026-04-06 03:41 GMT

Bullet Train

 Bullet Train : ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోబోతోంది. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విమాన వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లతో ఏపీని అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రం మీదుగా మరో రెండు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లు రాబోతున్నాయి. అమరావతిని దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో అనుసంధానించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభించింది. గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్ రాబోతోంది. అలాగే నాయుడుపేట నుంచి తిరుపతి, చిత్తూరు, బంగారుపేట మీదుగా బెంగళూరును కలుపుతూ మైసూర్‌ వరకు మరో హైస్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం ప్రాజెక్టులో చేర్చింది. దీనివల్ల అమరావతి నుంచి కేవలం గంటల వ్యవధిలోనే ఇతర మెట్రో నగరాలకు చేరుకునే అవకాశం కలుగుతుంది.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీ మీదుగా వెళ్లే మూడు ప్రధాన బుల్లెట్ రైలు కారిడార్లను (హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్) ఇప్పటికే పొందుపరిచారు. వీటికి సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్ సర్వే వేగంగా జరుగుతోంది. ఈ సర్వే పూర్తయిన వెంటనే డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసి టెండర్లు పిలవనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలును (ముంబై-అహ్మదాబాద్) ప్రారంభించాలని రైల్వే శాఖ డెడ్ లైన్ పెట్టుకుంది. అదే ఊపులో ఏపీలోని ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించాలని కేంద్రం భావిస్తోంది.

ఈ భారీ ప్రాజెక్టులకు అత్యంత కీలకమైనది భూసేకరణ. ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూమిని సేకరించి, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ-బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌తో పాటు విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉన్న విపరీతమైన రద్దీని తగ్గించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైజాగ్ మార్గంలో హైస్పీడ్ రైలు వస్తే అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు ప్రయాణం ఎంతో సులభతరం కానుంది.

పార్లమెంట్‌లో అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత లభించడంతో అభివృద్ధి పనులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. కేవలం బుల్లెట్ రైళ్లే కాకుండా, అమరావతి నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీ పెంచేలా బహుళ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతిలో సరికొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు పూర్తయితే ఏపీలో పారిశ్రామికంగా, ఆర్థికంగా ఊహించని వృద్ధి కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News