Sullurpeta: అధికారులు జర జాగ్రత్త.. మాజీ మంత్రి కాకాణి మాస్ వార్నింగ్!
Sullurpeta: తిరుపతి జిల్లా పెళ్లకూరులో అక్రమ కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ నేత సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పరామర్శించారు.
Sullurpeta: అధికారులు జర జాగ్రత్త.. మాజీ మంత్రి కాకాణి మాస్ వార్నింగ్!
Sullurpeta: తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం , చిల్లకూరు గ్రామంలో అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లిన మాజీ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులను, సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యతో కలిసి పరామర్శించారు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి.
సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పెళ్లకూరు మండల పరిషత్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, ధైర్యం చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు నుండి పెళ్ళకూరుకు బయలుదేరిన కాకాణికి దారి పొడవునా బొకేలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికి, వెంట నడిచాయి వైఎస్సార్ సీపీ శ్రేణులు కాకాణి తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు.
అధికారుల తీరు, అక్రమ కేసులు, అరెస్టులపై మండిపడ్డారు కాకాణి..
సత్యనారాయణ రెడ్డి తోపాటు, శేఖర్ రెడ్డి ,ఇతర నాయకుల అక్రమ అరెస్టుల పై స్పందించారు కాకాణి. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. సంజీవయ్య లాంటి మృదు స్వభావం కలిగిన నేతలపై తప్పుడు కేసులు పెట్టడం తగదని హితవు చెప్పారు కాకాణి.
గర్జించే సింహం కంటే, గాయపడ్డ సింహం ప్రమాద కరమని హెచ్చరించారు కాకాణి. వైఎస్ఆర్ సీపీ వచ్చిన తర్వాత మాత్రం దెబ్బకు, దెబ్బ సిద్ధాంతం, ఎవరితోనూ సర్దుబాటు ధోరణిలో వెళ్లే ప్రసక్తే లేదన్నారు కాకాణి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోందని వెల్లడించారు కాకాణి.
అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివి, అక్రమ కేసులకు మేము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు కాకాణి. కూటమి ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నించే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారిందన్నారు. జైలుకు వెళ్లిన సత్యనారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి లాంటి నాయకులు, వారి కుటుంబం సభ్యులు, అత్యంత ధైర్యంగా ఉన్నారని చెప్పారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ :
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ సెక్షన్లతో కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పరిశీలించడానికి వెళ్లిన వారిపై రివర్స్ కేసులు పెట్టడం దుర్మార్గం అని, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి, మరియు స్థానిక రైతులతో కలిసి ఇసుక రీచ్‌లను పరిశీలించగా, అక్కడ అనుమతి లేకుండానే మిషనరీ వాడుతున్నట్లు గుర్తించి, ప్రశ్నించారని చెప్పారు.
ప్రశ్నించినందుకు ప్రతీకారంగా, ఏడేళ్ల నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లను కావాలనే ఈ కేసులో చేర్చి సత్య నారాయణ రెడ్డి ని అక్రమంగా ఆరెస్ట్ చేసి జైలు కి పంపారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సంజీవయ్య మీద లేని సెక్షన్లు పెట్టి అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే, హైకోర్టును ఆశ్రయించి, అసలు నమోదు చేయకూడని సెక్షన్ లు నమోదు చేశారని కోర్టుకు విన్నవించామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య వంటి మృదు స్వభావిపై అక్రమ కేసులు పెట్టడం దురదృష్టకరం, ఆయన ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదని చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, తప్పు చేస్తున్న అధికారులు రేపు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వారిని గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మనసుతో క్షమించి వదిలేశామని , కానీ ఈసారి అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ మెతక వైఖరి చూపేదే లేదు అంటూ ఘాటుగా స్పందించారు. కూటమి నాయకుల కక్ష సాధింపుతో జైలుకు వెళ్లిన సత్యనారాయణ రెడ్డి ధైర్యంగా ఉన్నాడని, మరియు ఆయన కుటుంబం అత్యంత ధైర్యంగా ఉందని చెప్పారు కాకాణి. సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టు ఆయనలోని మానసిక స్తైర్యాన్ని దెబ్బతీయలేదని,
పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని చెప్పారు. గతంలో ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం సెక్షన్ లు,నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు, ఏ సెక్షన్ పెడితే ఎక్కువ కాలం జైల్లో ఉంటాడో చూసి మరీ కేసులు బనాయిస్తున్నారని,,ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు , పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంటూ సూచించారు.
అక్రమ అరెస్టులతో ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును నొక్కలేరని, కూటమి ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల చిట్టా సిద్ధం చేస్తున్నామని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న వారికి 'దెబ్బకు దెబ్బ' సిద్ధాంతం ద్వారానే సమాధానం చెబుతాం అని అన్నారు. ఈరోజు ఏ కుటుంబ సభ్యులైతే తమ వారు జైలుకు వెళ్లారని బాధపడుతున్నారో, రేపు అధికారులతో సహా కూటమి పార్టీ నాయకులు అంతకు పది రెట్లు ఇబ్బంది పడతారని అన్నారు. తప్పు చేసిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు.
నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఉమ్మడి జిల్లాలలో ఒక చోట తప్పు చేసి మరో చోటికి బదిలీ అయి వెళ్లిపోతే తప్పించుకోవచ్చని కొంతమంది పోలీసు అధికారులు భావిస్తున్నారని, కానీ ఈసారి అది సాధ్యం కాదని అన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, వైఎస్ఆర్ సీపీ నేతలను ఇబ్బంది పెట్టిన నాయకులు , ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారుల తోపాటు ఎస్పీ స్థాయి అధికారి అయినా సరే విచారించి తప్పు చేసినట్లు రుజువైతే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా తప్పు చేసిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, పదవీ విరమణ చేసినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పక శిక్షిస్తాం అని అన్నారు.
తప్పుడు కేసులతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, పీ.టీ వారెంట్లతో ఏళ్ల తరబడి జైళ్లలో ఉండేలా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వములో వైఎస్ఆర్ సీపీ నేతలను ఇబ్బందులు గురిచేసి, పక్క నియోజకవర్గాల వై ఎస్ ఆర్ సి పి ఇన్చార్జిలతో మంచిగా మాట్లాడుతూ నాటకాలు ఆడుతున్న కొంతమంది అధికారుల పప్పులు ఈసారి ఉడకవని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అక్రమ కేసుల పర్వాన్ని ఎండగట్టడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు.
తప్పుడు ఫిర్యాదులతో నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, ఏళ్ల తరబడి జైల్లో ఉండేలా కుట్రలు చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఉప్పెనలా ఎదురుదాడి చేస్తామే తప్ప, భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉంది చట్టపరంగానే అన్ని అక్రమ కేసులను ఎదుర్కొంటామని అన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని , ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాభోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం, జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఎక్కడికీ తరలించాలని చూడలేదని , కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే కోరుకున్నారని గుర్తు చేశారు.
మా నాయకుడు జగన్ మావి గన్ అనే ఒక్క మాట అంటే కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఇది వారిలోని అభద్రతా భావాన్ని సూచిస్తోందని చెప్పారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తను, నాయకుడిని కాపాడుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే ప్రజల్లోనూ, అటు ఉద్యోగుల్లోనూ అసహనం మొదలైంది అందరూ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలిచి, ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.