Narendra Modi: సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన ప్రధాని

Narendra Modi: రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Update: 2021-05-10 04:26 GMT

Narendra Modi: సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన ప్రధాని

Narendra Modi: రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత లేదని, రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే వున్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్ధంగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో వున్నాయని, 2470 ఆక్సీజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధంగా వున్నాయని తెలిపారు. మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో వున్నాయన్నారు. కాగా ప్రయివేటు దవాఖానాల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను చేయాలని సీఎం సూచించారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం కేంద్ర మంత్రికి కొన్ని విలువైన సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం వున్న 'అతివేగంగా వ్యాప్తి కారకులను' గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ ను డెలివరీ చేసే బాయ్స్, స్ట్రీట్ వెండర్స్, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశాముంటుందని సీఎం తెలిపారు. సీఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సమీక్షా సమావేశానంతరం సీఎం కేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రికి సీఎం చేసిన సూచనలను తనకు వివరించారని తెలిపారు. "మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలాబాగున్నాయి వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం మీ సూచనలకు అభినందనలు" అంటూ ప్రధాని సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని, సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని ప్రధాని సీఎంకు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News