Hyderabad: తల్లిపై మమకారం.. పెళ్లి కావడం లేదని మనోవేదన: ఐటీ యువతి ఆత్మహత్య

Hyderabad: కన్నతల్లిపై ఉన్న అపారమైన ప్రేమ, అదే సమయంలో తన భవిష్యత్తుపై ఆందోళన ఆ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి.

Update: 2026-02-03 05:38 GMT

Hyderabad: కన్నతల్లిపై ఉన్న అపారమైన ప్రేమ, అదే సమయంలో తన భవిష్యత్తుపై ఆందోళన ఆ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి. అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలి రాలేనని, తనతోనే ఉంచుకుంటానన్న నిబంధనకు పెళ్లి సంబంధాలు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి (26) కూకట్‌పల్లి మైత్రినగర్‌లో నివసిస్తూ ఒక ఐటీ సంస్థలో పనిచేస్తోంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన విజయలక్ష్మికి, తల్లి సరస్వతియే సర్వస్వం. అయితే తల్లికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమెకు అన్నీ తానై సపర్యలు చేసేది.

పెళ్లి సంబంధాల తిరస్కరణే కారణం: ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. అయితే, వివాహం తర్వాత కూడా తన తల్లి తనతోనే ఉంటుందని ఆమె స్పష్టం చేసేది. ఈ నిబంధనకు వరుడి తరపు వారు అంగీకరించకపోవడంతో వరుసగా సంబంధాలు తప్పిపోయాయి. తల్లి పరిస్థితి, తన పెళ్లి కాకపోవడంపై తీవ్ర మనోవేదనకు గురైన ఆమె శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తుండగా, సోమవారం హుస్సేన్‌సాగర్‌లో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. అది విజయలక్ష్మిదేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిని అనాథను చేసి విజయలక్ష్మి తిరిగిరాని లోకాలకు వెళ్లడం స్థానికంగా విషాదం నింపింది.

Tags:    

Similar News