ఆరోగ్యలక్ష్మికి శాపం బాలింతలకు అందాల్సిన పాలు బురదపాలు.. బాధ్యులెవరు?
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో అంగన్వాడీ పాలు ఒర్రెలో పడి ఉండటం కలకలం రేపింది.
ఆరోగ్యలక్ష్మికి శాపం బాలింతలకు అందాల్సిన పాలు బురదపాలు.. బాధ్యులెవరు?
కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి): ప్రభుత్వం గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ కోసం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం అంగన్వాడీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా వృధాగా మారుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం తాజాగా బయటపడింది. గర్భిణీలు మరియు బాలింతలకు పంపిణీ చేయాల్సిన ‘ఆరోగ్యలక్ష్మి’ పాల ప్యాకెట్లు గ్రామ శివారులోని కొత్తకుంట ఒర్రెలో వృధాగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎక్స్‌పైరీ అయ్యే వరకు దాచిపెట్టి..
గ్రామ శివారులోని ఒర్రెలో పెద్ద ఎత్తున పాల ప్యాకెట్లు పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు విస్తుపోయారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అందజేయాల్సిన ఈ ప్యాకెట్లను, అంగన్వాడీ సిబ్బంది గడువు ముగిసే వరకు (Expiry) సెంటర్లోనే దాచిపెట్టారని, ఆపై ఎవరూ చూడకుండా చీకట్లో ఒర్రెలో పడేశారని సర్పంచ్ తులా మనోహర్ రావు ఆరోపించారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్:
అర్హులకు అందాల్సిన పాలు ఇలా ఒర్రె పాలు కావడంతో సర్పంచ్ మనోహర్ రావు మరియు గ్రామస్తులు అంగన్వాడీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని తక్షణమే శిక్షించాలని వారు కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ లోపించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.