హెచ్.పి.వి వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలి అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు
కరీంనగర్ జిల్లాలో హెచ్.పి.వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.
హెచ్.పి.వి వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలి అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు
కరీంనగర్: జిల్లాలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్.పి.వి (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో విద్యా, ఆరోగ్య, మహిళా సంక్షేమ, డి.ఆర్.డి.ఏ మరియు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులతో ఆమె ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
అర్హులైన బాలికల గుర్తింపు:
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి, జమ్మికుంట మరియు హుజరాబాద్ ఏరియా ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఈ వ్యాక్సినేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు సమీపంలో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న 14 సంవత్సరాలు నిండిన బాలికలను గుర్తించి, వారికి తప్పనిసరిగా టీకాలు వేయించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అర్హులైన బాలికల సమగ్ర జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు.
అవగాహన కల్పించాలి:
వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్దిష్ట తేదీల ప్రకారం నిర్వహించాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని ఆమె స్పష్టం చేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్ల ద్వారా తల్లిదండ్రులకు ఈ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గర్భాశయ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే అడ్డుకోవడానికి ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ఎస్సీ సంక్షేమ శాఖ డిడి నాగలేశ్వర్, ఆర్.ఎం.ఓ నవీన తదితరులు పాల్గొన్నారు.