పదవి కోసం పాశవికం: ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హుడని.. కన్న కూతురినే కెనాల్‌లో తోసి చంపిన కసాయి తండ్రి!

రాజకీయ పదవిపై మోజు ఒక తండ్రిని మృగంగా మార్చింది. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు 'ముగ్గురు పిల్లల నిబంధన' అడ్డు వస్తోందని, కన్న కూతురినే అతి దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

Update: 2026-02-02 10:18 GMT

రాజకీయ పదవిపై మోజు ఒక తండ్రిని మృగంగా మార్చింది. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు 'ముగ్గురు పిల్లల నిబంధన' అడ్డు వస్తోందని, కన్న కూతురినే అతి దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంప్ నిజాం సాగర్ కెనాల్‌లో ఇటీవల లభ్యమైన బాలిక మృతదేహం కేసును ఛేదించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

కుట్ర వెనుక అసలు కారణం:

మహారాష్ట్రలోని ముత్కేడ్ మండలం కేరూరు గ్రామానికి చెందిన పాండురంగ అనే వ్యక్తికి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే కోరిక కలిగింది. అయితే, ముగ్గురు సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన అతనికి అడ్డంకిగా మారింది. ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి, ప్రస్తుత సర్పంచ్ గణేష్‌తో కలిసి పాండురంగ ఒక కిరాతక పథకాన్ని రచించాడు.

పథకం ప్రకారం, తన పెద్ద కూతురు ప్రాచీని ఎడపల్లి సమీపంలోని నిజాం సాగర్ కెనాల్ వద్దకు తీసుకువచ్చాడు. ఎవరూ లేని సమయం చూసి, బాలిక ప్రాధేయపడుతున్నా వినకుండా బతికి ఉండగానే కెనాల్‌లోకి తోసేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఊపిరి ఆడక మరణించింది.

కెనాల్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారంతో నిందితులను గుర్తించారు. కన్న తండ్రి పాండురంగతో పాటు అతనికి సహకరించిన కేరూరు సర్పంచ్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారం కోసం పన్నెండేళ్ల బాలికను బలితీసుకున్న ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News