Telangana Budget 2025-26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
Telangana Budget 2025-26: వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Telangana Budget 2025-26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
Telangana Budget 2025-26: వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం ప్రవేశపెట్టారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయంసహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. సెర్ప్, టీజీఆర్‌ఈడీసీఓ, టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు మహిళలకు జీవనోపాధి కూడ లభిస్తోందని ప్రభుత్వం తెలిపింది. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయాలను వడ్డీలేని రుణాలు అందించనున్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులను తెలంగా ఆర్టీసికి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 150 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నారాయణపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలు నడిపే పెట్రోల్ బంక్ కు రూ.1.23 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. రిటైల్, రవాణా రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. రుణ భీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల సహజ మరణ భీమా, రూ. 10 లక్షలు ప్రమాద భీమా అందించనున్నారు.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించారు.జత యూనిఫాం కుట్టు చార్జీలను రూ.75కుపెంచారు. 37.5 లక్షల యూనిఫాంలు కుట్టడం ద్వారా రూ.28 కోట్ల ఆదాయం సంపాదించారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణం అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.21,632 కోట్లను స్వయం సహాయక సంఘాలకు అందించిన విషయాన్ని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. 22 ఇందిరా మహిళాశక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి రూ.110 కోట్లను కేటాయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.