Delimitation Explainer: డీలిమిటేషన్‌తో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం?

Delimitation meaning and how it is carries out?: డీలిమిటేషన్‌ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Update: 2025-03-09 01:30 GMT

Delimitation Explainer: డీలిమిటేషన్‌ అంటే ఏంటి? ఎలా చేస్తారు? నియోజకవర్గాల ు ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం? 

Full View

What is delimitation and why it is facing criticism from South India: డీలిమిటేషన్... అంటే నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం భారత్ లో ఎక్కువ చర్చనియాంశమైన ఇది కూడా ఒకటి. 2026 లో దేశంలో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే, ఈ పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

జనాభా లెక్కల ప్రకారం జరిగే డీలిమిటేషన్ ప్రక్రియకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ వంటి వారు ఎందుకు నో చెబుతున్నారు? ఈ పునర్విభజనతో ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం? ఏ రాష్ట్రానికి ఎక్కువ లాభం? ఉత్తరాది రాష్ట్రాలు దీనిపై ఎందుకు నోరు విప్పడం లేదనేదే ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీ.

అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు?

రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కింపు తరువాత కేంద్రం కచ్చితంగా చేయాల్సిన పనుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలను విభజించి, సరిహద్దులు గుర్తిస్తారు. అలాగే ఏయే నియోజకవర్గాలకు ఎస్సీ, ఎస్టీ ప్రాతినిథ్యం అవసరం ఉందనే లెక్కలు కూడా తేలుస్తారు.

పార్లమెంట్ చట్టం ప్రకారం కేంద్రం ఒక డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేస్తుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు.

1952 లో తొలి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1951 జనాభా లెక్కల ప్రకారం 36 కోట్ల 10 లక్షల జనాభాకు 494 లోక్ సభ స్థానాలను గుర్తించారు.

1963 లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1961 జనాభా లెక్కల ప్రకారం 43 కోట్ల 90 లక్షల జనాభాకు లోక్ సభ స్థానాల సంఖ్యను 522 కు పెంచారు.

అలాగే 1973 లో 54 కోట్ల 80 లక్షల జనాభాకుగాను ఆ సంఖ్యను 543 కు పెంచారు.

2000 సంవత్సరంలో వాజ్‌పేయి కీలక నిర్ణయం

ఆ తరువాత 2002 కూడా మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా 1973 నాటి జనాభా లెక్కల ప్రకారమే లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచకుండా, తగ్గించకుండా 543 స్థానాలనే కొనసాగించారు.

అంతేకాదు... మరో 25 ఏళ్ల వరకు.. అంటే 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియను చేయరాదని 84వ సవరణ ద్వారా పార్లమెంట్‌లో ఒక చట్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆ చొరవ తీసుకున్నారు.

ఇక ప్రస్తుత విషయానికొస్తే... 2021 లోనే జనాభా లెక్కింపు జరగాల్సింది. కానీ అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా అది జరగలేదు. ఇప్పుడు 2026 లో జనాభా లెక్కింపు జరగనుంది. ఆ తరువాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది.

పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టం?

నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ప్రకారం చేస్తారని ముందుగానే చెప్పుకున్నాం కదా! అయితే, ఇక్కడ ఇప్పుడు మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి ముందుగా చెప్పుకోవాలి.

1952 లో అప్పటి భారత ప్రభుత్వం జనాభా పెరుగుదలను అదుపులో పెట్టడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంను తెరపైకీ తీసుకొచ్చింది. 1976 తరువాత ఈ కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది.

కేంద్రం ఆదేశాల ప్రకారమే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో చాలా చురుకుగా వ్యవహరించాయి. జనాభా పెరగకుండా చూసుకోవడంలో విజయం సాధించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాల జనాభాతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల చాలా వరకు తగ్గింది. కానీ దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఈ విజయమే ఇప్పుడు తమ పాలిట శాపమైందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఎందుకంటే, జనాభా ప్రాదిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుంది.

ఇది కేవలం లోక్‌సభలోనే కాదు... రాజ్య సభలో రాష్ట్రాలకు కేటాయించే రాజ్యసభ సభ్యుల సంఖ్యపై కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. దీంతో భవిష్యత్‌లో పార్లమెంట్‌లో అన్నిరకాలుగా తమ రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పార్లమెంట్‌లో తమ డిమాండ్లను వినిపించే అవకాశాలను, హక్కులతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను కూడా కోల్పోవడమే అవుతుందనేది వారి వాదన.

ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం

ప్రస్తుతం లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా అందులో దక్షిణాది రాష్ట్రాల నుండి 129 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో ఇది కేవలం 24 శాతం మాత్రమే.

అందులో తెలంగాణ నుండి 17 మంది,

ఏపీ నుండి 25 మంది,

కేరళ నుండి 20 మంది,

తమిళనాడు నుండి 39 మంది

కర్ణాటక నుండి 28 మంది సభ్యులు ఉన్నారు.

ఇప్పుడు పెరిగే లోక్‌సభ స్థానాల అంచనా

1951, 1961, 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్ సభ స్థానాలు పెరిగిన తీరు చూస్తే...ఇప్పుడున్న జనాభా ప్రకారం ప్రతీ 20 లక్షల మందికి ఒక లోక్ సభ స్థానం ప్రకారం విభజించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే మొత్తం లోక్ సభ స్థానాలు 543 నుండి 753 కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఇంకొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 846 వరకు కూడా పెరగొచ్చని తెలుస్తోంది.

ఒకవేళ లోక్ సభ స్థానాలు 753 కు పెరిగినట్లయితే, ఆ తరువాత రాష్ట్రాల వారీగా లోక్ సభ స్థానాల లెక్క ఇలా ఉండే అవకాశం ఉంది.

తెలంగాణకు 20 స్థానాలు (3 స్థానాలు పెంపు)

ఆంధ్రప్రదేశ్‌కు 28 స్థానాలు (3 స్థానాలు పెంపు)

కేరళకు 19 స్థానాలు (1 స్థానం నష్టం)

తమిళనాడుకు 41 స్థానాలు ( 2 స్థానాలు పెంపు)

కర్ణాటకకు 36 స్థానాలు (8 స్థానాలు పెంపు) కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం 753 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 144 మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పటి వరకు ఉన్న 24 శాతం నుండి 19 శాతానికి తగ్గుతుంది.

ఎక్కువ లాభం ఏ రాష్ట్రానికి?

ఇప్పటికే 80 లోక్ సభ స్థానాలతో ఉత్తర్ ప్రదేశ్ ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా నెంబర్ 1 స్థానంలో ఉంది. అందుకే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా యూపీలో విజయం ఎంతో ముఖ్యం అని అంటుంటారు. 2026 డీలిమిటేషన్ తరువాత యూపీలో లోక్ సభ స్థానాల సంఖ్య 80 నుండి 128 కి పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.

అదే కానీ జరిగితే ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఎక్కువ లాభం పొందే రాష్ట్రం యూపీ అవుతుంది. ఇక ప్రస్తుతం యూపీలో ఎక్కువగా ఏ పార్టీ హవా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

ఆ తరువాత ఎక్కువ లాభం పొందే రాష్ట్రాల్లో బీహార్ ఉంటుంది. యూపీ తరువాత ఎక్కువ జనాభా ఉన్న బీహార్ లో ఇప్పుడున్న లోక్ సభ స్థానాల సంఖ్య 40 నుండి 70 కి పెరిగే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో ఇప్పుడున్న 48 లోక్ సభ స్థానాల నుండి 68 కి పెరిగే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న 29 స్థానాల నుండి 47 కు పెరిగే అవకాశం ఉంది.

అలాగే రాజస్థాన్ లో 25 స్థానాల నుండి 44 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ అంచనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం భారీగా తగ్గిపోనుండగా... ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరిగిపోనుంది. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలు ఏం చెబుతున్నాయి?

1) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెర్షన్

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డీలిమిటేషన్‌పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. "దక్షిణ భారత్‌లో బీజేపికి ఎక్కువ బలం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపి మొత్తం 240 స్థానాలు గెలుచుకుంటే అందులో దక్షిణాది నుండి కేవలం 29 స్థానాలే ఉన్నాయి. పైగా దక్షిణాన ఏ రాష్ట్రంలోనూ బీజేపి అధికారంలో లేదు. ఏపీ సర్కారులో బీజేపి చిన్న పార్ట్‌నర్ మాత్రమే. అందుకే డీలిమిటేషన్ పేరుతో బీజేపీ దక్షిణది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దీంతో పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం తగ్గి ఉత్తర భారత్ కు ప్రాధాన్యత పెరుగుతుంది" అని అన్నారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం దక్షిణ రాష్ట్రాలకు విధిస్తున్న శిక్షగా దీనిని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 1971 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేసి మరో 30 ఏళ్లు డీలిమిటేషన్‌పై స్టేటస్ కో విధించాలని అన్నారు.

2) తమిళనాడు సీఎం స్టాలిన్

2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం కోసం 1971 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేశారు. అంతేకాకుండా మరో 25 ఏళ్లపాటు పునర్విభజన చేయరాదని చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా 2026 తరువాత మరో 30 ఏళ్లపాటు పునర్విభజన చేయకుండా చట్టం తీసుకురావాలి. అలాగే తమిళనాడులో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం మరో 22 లోక్ సభ స్థానాలు పెంచాలి. ఇది ఎంకే స్టాలిన్ చేస్తోన్న డిమాండ్.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కాకుండా చూసుకోవడం మన బాధ్యతే అంటూ ఆయన దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ యుద్ధంలో కేంద్రానికి వ్యతిరేకంగా జేఏసి ఏర్పాటు చేసేందుకు కలిసి రావాల్సిందిగా ఆయన పంజాబ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులను కూడా కోరారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం దక్షిణ రాష్ట్రాల మెడపై కత్తి వేళ్లాడదీసిందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.

3) చంద్రబాబు నాయుడు మాటేంటి?

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వెర్షన్ మరోలా ఉంది. జనాభాను, నియోజకవర్గాల పునర్విభజనను ఒకదానితో మరొకటి ముడిపెట్టొద్దని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

రెండింటిని వేర్వేరుగానే చూడాల్సిన అవసరం ఉందన్నారు. పునర్విభజన వల్ల లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనకు కేంద్రం పరిష్కారం సూచిస్తుందన్నారు. జాతియ కోణంలో ఆలోచించే తాను ఈ మాటలు చెబుతున్నానని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

ఒక్కోసారి అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా ఉంటుందన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను ప్రోత్సహించిన తను కూడా ఇప్పుడు జనాభా పెంపు అవసరం ఉందని చెబుతున్నానని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇంతకీ కేంద్రం ఏమంటోంది?

డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల నుండి వస్తోన్న వ్యతిరేకతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దక్షిణ రాష్ట్రాలు అనుకుంటున్నట్లుగా వారికి అన్యాయం జరగదని అన్నారు. ప్రోరేటా ప్రకారమే పునర్విభజన జరుగుతుందన్నారు. ఒకవేళ లోక్ సభ స్థానాల పెంచడం జరిగితే, అందులో దక్షిణాది రాష్ట్రాలకు కూడా సమానమైన వాటా ఉంటుందన్నారు.

ఇన్ని అనుమానాలు, ఆరోపణల మధ్య వచ్చే ఏడాది జనాభా లెక్కింపు జరగనుంది. ఆ తరువాతే డీలిమిటేషన్ జరగనుంది. మరి ఈలోగా దక్షిణాది నుండి ఇంకెన్ని ఉద్యమాలు వస్తాయో, వాటికి కేంద్రం ఎలా సమాధానం చెబుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. 

Also watch this video : New Income Tax Bill: ఐటి అధికారుల చేతుల్లో మీ ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా

Full View

Also watch this video : Actress Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?

Full View

Also watch this video :  Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు.. ఏయే వ్యాపారాల్లో నష్టం ఎక్కువంటే...

 Full View

Tags:    

Similar News